సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు విధులకు దూరంగా ఉన్నా ప్రభుత్వంలో చలనంలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కనీసం ఐదు నిమిషాల పాటు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమని గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీఆర్వోలు 14 ఏళ్లుగా ఒకే క్యాడర్‌లో ఉద్యోగం నిర్వహించడం బాధాకరమని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు సీఎస్‌కు తెలియవని, సీఎం కేసీఆర్‌ను ఆయన తప్పదోవ పట్టిస్తున్నారని జేఏసీ ఆరోపించింది. శనివారం సీసీఎల్‌ఏలో వీఆర్వోల జేఏసీ సమావేశం అయింది. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, అదనపు సెక్రెటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, కో చైర్మన్ రవి నాయక్, వైస్ చైర్మన్లు మౌలానా, నూకల శంకర్, రవీందర్, ప్రతిభ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణాగౌడ్ తదితరులు భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖను రద్దు చేయాలని ప్రయత్నం జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ఏకం కావాలని కోరారు. పెద్ద సంఖ్యలో ఉన్న వీఆర్వోలు, వీఆర్‌ఏలు విధులకు దూరంగా ఉండడం వల్ల పాలన కుంటుపడిపోయిందని అన్నారు. ప్రభుత్వం వీఆర్వోల సర్వీసును గుర్తించి రెవె న్యూ శాఖలోనే మరో పేరుతో కొనసాగించాలని కోరుతున్నామన్నారు. వీఆర్ ఏలకు స్కేలు మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment