సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. తాజాగా ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రవాణాశాఖ కమిషనర్ శ్రీనివాసరాజులతో కలసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు.
పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గించి అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏడు నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు ప్రస్తుతం రూ.6 వేల వరకు విధిస్తున్న గ్రీన్‌ట్యాక్స్‌ను రూ.1,500, 12 ఏళ్లు దాటిన వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్న మొత్తాన్ని రూ.3 వేలకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం తెలిసింది.
ఇది తమకు భారంగా ఉన్నందున ఆ పన్నును ఎత్తేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పన్నును గరిష్టస్థాయిలో తగ్గిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌ను అమలు చేసేందుకు కూడా హామీ ఇచ్చా రు. లారీలు ఏపీలోకి ప్రవేశించిన ప్రతీసారీ రూ.2 వేలు పన్ను చెల్లించాల్సి వస్తోంది. దానికి బదులు ఏడాదికి ఒకేసారి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వసూలు చేసి ఎన్నిసార్లయినా వెళ్లివచ్చేందుకు అవకాశం కల్పించాలని ఏళ్లుగా లారీ యజమానులు కోరుతున్న దానిని కొలిక్కి తెస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.
లైసెన్సుల సస్పెన్షన్‌పై ఉపశమనం..
నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలను పట్టుకున్నప్పుడు డ్రైవర్ల లైసెన్సులను నిర్ధారిత కాలానికి సస్పెండ్ చేస్తున్నారు. ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు కూడా సానుకూలత లభించింది. సస్పెన్షన్ బదులు పెనాల్టీ విధించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తైబజార్‌లలో లారీవాలాలనుంచి కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్న మొత్తం తమకు భారంగా ఉందని, వ్యాపారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన మొత్తాన్ని లారీల నుంచి వసూలు చేయటం ఏంటని సంఘం నేతలు ప్రశ్నించారు.
ఇసుక క్వారీల్లోని ఇబ్బందులనూ వారి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని కూడా పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందారెడ్డి, ఉపాధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment