సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్‌ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయా లని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చనందున ఆ పదవికి ఆయన రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని సూచించారు.
కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించడం సీఎం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేంద్రం ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించిన అధికారులను అక్కడకు, తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వ రాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటున్నారని, 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment