గుడివాడ : ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంతవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబితా విడుదలే అస్తవ్యస్తంగా ఉందని, ఫలితంగా తమపేరు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు లేవని తెలిసిన రైతులు భయాందోళనకు గురువుతున్నారు.
నాలుగు నెలలుగా రుణమాఫీపై ఆశలు పెట్టుకుంటే తీరా పేరులేదని తెలిసిన రైతాంగం ఏంచేయాలో తెలియని స్థితిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 6.2 లక్షల మంది రైతులు రుణమాఫీ పరిధిలో ఉన్నారు. వీరిలో అనేకమంది పేర్లు జాబితాలో లేవని రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీ చేసి వడ్డీలు కూడా కడతామని చెబుతున్న ప్రభుత్వం తొలిదశలోనే పేర్లు లేకుండా చేయటంపై రైతులు మండిపడుతున్నారు.
జాబితాలో తికమకలు..
ప్రభుత్వం రుణమాఫీ జాబితాలో రైతుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉన్నందున వారి వివరాలను ఈ నెల ఎనిమిదిన విడుదల చేసింది. ఈ జాబితా సోమవారం సాయంత్రానికి తహశీల్దార్ కార్యాలయాల నుంచి వీఆర్వోలకు చేరింది. జాబితాలోని రైతుల పేర్లు చూసి ఆయా రైతులు ఇంకా ఇవ్వాల్సిన వివరాలు పూర్తిచేసి పంపాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇది రెండు రోజుల్లో పూర్తిచేసి ఇవ్వాలని చెప్పారు. రుణమాఫీ జాబితాలు అస్తవ్యస్తంగా ఉండటంతో రెండు రోజుల్లో వివరాలు పూర్తిచేసి పంపటం కష్టమని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
రుణమాఫీ జాబితాలో కొన్ని బ్యాంకుల వారీగా ఇవ్వగా మరికొన్ని ఎక్కడ భూమి ఉందో ఆప్రాంతంలో ఉన్న జాబితాలోకి వెళ్లాయి. గుడివాడకు చెందిన సుబ్బారావుకు ఉయ్యూరులో భూమి ఉంది. దీనిపై గుడివాడ ఎస్‌బీఐలో ఆయన రుణం పొందాడు. జాబితాలో మాత్రం భూమి ఉన్న ఉయ్యూరులోనే ఉంటుందని అధికారులు వివరణ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల బ్యాంకు ఆధారంగా జాబితా ఇవ్వటం గమనార్హం.
ఏమేమి సేకరిస్తున్నారంటే...
ప్రతి రైతూ తన ఆధార్, రేషన్ కార్డు నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి లేకపోతే వాటిని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఇవిగాక ఆ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లల ఆధార్ నంబర్లు, ఓటు గుర్తింపు కార్డు నంబర్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఉంటేనే రుణమాఫీ జాబితాకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి మంది వీఆర్వోలు ఈ జాబితా సరిచేయటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటింటా వివరాల సేకరణకు చాలా సమయం పడుతుందని వారంటున్నారు.
కౌలు రైతులకు చోటులేదు...
గుడివాడ పట్టణంలో విడుదలైన జాబితాలో కౌలు రైతుల పేర్లు లేవని చెబుతున్నారు. రుణాలు తీసుకున్నా బ్యాంకర్లు కౌలు రైతుల పేర్లు ఇవ్వని కారణంగా ఈ పరిస్థితి దాపురించినట్లు సమాచారం. బ్యాంకులకు ఇచ్చిన ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో కౌలు రైతు ఆప్షన్ లేకపోవటమే ఇందుకు కారణమని కొన్ని బ్యాంకుల వారు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతూ పైసా కట్టాల్సిన పనిలేదని చెప్పిన చంద్రబాబు రుణాలు రద్దుకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
అస్తవ్యస్తం..గందరగోళం
Published Wed, Nov 12 2014 12:57 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM
Advertisement
Advertisement