List of Debt waiver
-
అస్తవ్యస్తం..గందరగోళం
గుడివాడ : ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంతవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబితా విడుదలే అస్తవ్యస్తంగా ఉందని, ఫలితంగా తమపేరు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు లేవని తెలిసిన రైతులు భయాందోళనకు గురువుతున్నారు. నాలుగు నెలలుగా రుణమాఫీపై ఆశలు పెట్టుకుంటే తీరా పేరులేదని తెలిసిన రైతాంగం ఏంచేయాలో తెలియని స్థితిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 6.2 లక్షల మంది రైతులు రుణమాఫీ పరిధిలో ఉన్నారు. వీరిలో అనేకమంది పేర్లు జాబితాలో లేవని రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీ చేసి వడ్డీలు కూడా కడతామని చెబుతున్న ప్రభుత్వం తొలిదశలోనే పేర్లు లేకుండా చేయటంపై రైతులు మండిపడుతున్నారు. జాబితాలో తికమకలు.. ప్రభుత్వం రుణమాఫీ జాబితాలో రైతుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉన్నందున వారి వివరాలను ఈ నెల ఎనిమిదిన విడుదల చేసింది. ఈ జాబితా సోమవారం సాయంత్రానికి తహశీల్దార్ కార్యాలయాల నుంచి వీఆర్వోలకు చేరింది. జాబితాలోని రైతుల పేర్లు చూసి ఆయా రైతులు ఇంకా ఇవ్వాల్సిన వివరాలు పూర్తిచేసి పంపాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇది రెండు రోజుల్లో పూర్తిచేసి ఇవ్వాలని చెప్పారు. రుణమాఫీ జాబితాలు అస్తవ్యస్తంగా ఉండటంతో రెండు రోజుల్లో వివరాలు పూర్తిచేసి పంపటం కష్టమని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ జాబితాలో కొన్ని బ్యాంకుల వారీగా ఇవ్వగా మరికొన్ని ఎక్కడ భూమి ఉందో ఆప్రాంతంలో ఉన్న జాబితాలోకి వెళ్లాయి. గుడివాడకు చెందిన సుబ్బారావుకు ఉయ్యూరులో భూమి ఉంది. దీనిపై గుడివాడ ఎస్బీఐలో ఆయన రుణం పొందాడు. జాబితాలో మాత్రం భూమి ఉన్న ఉయ్యూరులోనే ఉంటుందని అధికారులు వివరణ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల బ్యాంకు ఆధారంగా జాబితా ఇవ్వటం గమనార్హం. ఏమేమి సేకరిస్తున్నారంటే... ప్రతి రైతూ తన ఆధార్, రేషన్ కార్డు నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి లేకపోతే వాటిని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఇవిగాక ఆ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లల ఆధార్ నంబర్లు, ఓటు గుర్తింపు కార్డు నంబర్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఉంటేనే రుణమాఫీ జాబితాకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి మంది వీఆర్వోలు ఈ జాబితా సరిచేయటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటింటా వివరాల సేకరణకు చాలా సమయం పడుతుందని వారంటున్నారు. కౌలు రైతులకు చోటులేదు... గుడివాడ పట్టణంలో విడుదలైన జాబితాలో కౌలు రైతుల పేర్లు లేవని చెబుతున్నారు. రుణాలు తీసుకున్నా బ్యాంకర్లు కౌలు రైతుల పేర్లు ఇవ్వని కారణంగా ఈ పరిస్థితి దాపురించినట్లు సమాచారం. బ్యాంకులకు ఇచ్చిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో కౌలు రైతు ఆప్షన్ లేకపోవటమే ఇందుకు కారణమని కొన్ని బ్యాంకుల వారు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతూ పైసా కట్టాల్సిన పనిలేదని చెప్పిన చంద్రబాబు రుణాలు రద్దుకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టారు
- అస్తవ్యస్తంగా రుణమాఫీ జాబితా - మొక్కుబడిగా సామాజిక తనిఖీ - తుది జాబితాలోనూ అనర్హులు - వడపోత విలువ రూ.145 కోట్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అనర్హుల ఏరివేత పేరిట సుదీర్ఘంగా సాగిన రుణమాఫీ ‘సామాజిక తనిఖీ’ చివరకు ప్రహసనంగా ముగిసింది. బ్యాంకర్లు సమర్పించిన జాబితాను క్షేత్రస్థాయిలో వడపోసిన అధికారులు చివరకు అనర్హుల సంఖ్య స్వల్పంగా ఉందంటూ చేతులు దులుపుకున్నారు. నకిలీ పాసు పుస్తకాలు పెట్టి రుణాలు కాజేసిన వారు, ఒకే పాసు పుస్తకంతో అనేక బ్యాంకుల్లో రుణం పొందిన వారి వివరాలు వెల్లడించడం లేదు. బ్యాంకర్లు సమర్పించిన జాబితాను మొక్కుబడిగా తనిఖీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో 6.31 లక్షల మంది రైతులు రూ.2906.71 కోట్ల మేర రుణమాఫీకి అర్హులంటూ బ్యాంకర్లు జాబితాలు సమర్పించారు. ఈ జాబితాలను బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు సభ్యులుగా ఉన్న బృందాలు సామాజిక తనిఖీ పేరిట వడపోశాయి. చివరగా 6.03లక్షల మంది రైతులు రూ.2761.08 కోట్ల మేర రుణమాఫీకి అర్హులంటూ తుది జాబితా రూపొందించారు. రూ.145.63 కోట్లు రుణం పొందిన 28,260 మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులంటూ నిగ్గు తేల్చారు. అయితే ఇందులో నకిలీ పాసు పుస్తకాలతో రుణం పొందిన వారెందరు అనే వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. తుది జాబితా (అనెక్సర్ ఈ) రూపొందించిన తర్వాత కూడా జాబితాలో అనర్హులున్నారంటూ పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాల నుంచి అందుతున్న ఫిర్యాదులను పునః పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి అధికారులు తిరస్కరిస్తుండడం అనుమానాలకు దారి తీస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, గ్రామసభల్లో జాబితాను సమగ్రంగా చదవక పోవడం, బ్యాంకర్లు ఇచ్చిన జాబితా తప్పుల తడకగా ఉండటం, మొక్కుబడి తనిఖీలు తుది జాబితా తయారీపై ప్రభావం చూపాయి. బ్యాంకర్ల తీరుపై అనుమానాలు పంట రుణాలు పొందిన రైతుల వివరాలను బ్యాంకర్లు అసమగ్రంగా ఇవ్వడం వల్లే తనిఖీ మొక్కుబడిగా జరిగిందనే అరోపణలు వస్తున్నాయి. కేవలం జాబితాను ఇచ్చిన బ్యాంకర్లు రైతుల చిరునామాలు, తనఖా పెట్టిన పాసు పుస్తకాలు మాత్రం గ్రామసభలకు తీసుకు రాలేదు. దీంతో నకిలీ పాసు పుస్తకాల గుర్తింపు క్లిష్టంగా తయారైందని సామాజిక తనిఖీలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. చాలా మంది తమకున్న భూమి కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని చూపి రుణాలు పొందినట్లు కూడా తనిఖీల్లో వెల్లడైంది. రుణ వితరణలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ ఆఫీసర్ల సహకారంతోనే నకిలీలు రుణాలు పొందారనే ఆరోపణలున్నాయి. రుణమాఫీ జాబితాను మరోమారు సమగ్రంగా పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.