కొండను తవ్వి.. ఎలుకను పట్టారు
- అస్తవ్యస్తంగా రుణమాఫీ జాబితా
- మొక్కుబడిగా సామాజిక తనిఖీ
- తుది జాబితాలోనూ అనర్హులు
- వడపోత విలువ రూ.145 కోట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అనర్హుల ఏరివేత పేరిట సుదీర్ఘంగా సాగిన రుణమాఫీ ‘సామాజిక తనిఖీ’ చివరకు ప్రహసనంగా ముగిసింది. బ్యాంకర్లు సమర్పించిన జాబితాను క్షేత్రస్థాయిలో వడపోసిన అధికారులు చివరకు అనర్హుల సంఖ్య స్వల్పంగా ఉందంటూ చేతులు దులుపుకున్నారు. నకిలీ పాసు పుస్తకాలు పెట్టి రుణాలు కాజేసిన వారు, ఒకే పాసు పుస్తకంతో అనేక బ్యాంకుల్లో రుణం పొందిన వారి వివరాలు వెల్లడించడం లేదు. బ్యాంకర్లు సమర్పించిన జాబితాను మొక్కుబడిగా తనిఖీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో 6.31 లక్షల మంది రైతులు రూ.2906.71 కోట్ల మేర రుణమాఫీకి అర్హులంటూ బ్యాంకర్లు జాబితాలు సమర్పించారు.
ఈ జాబితాలను బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు సభ్యులుగా ఉన్న బృందాలు సామాజిక తనిఖీ పేరిట వడపోశాయి. చివరగా 6.03లక్షల మంది రైతులు రూ.2761.08 కోట్ల మేర రుణమాఫీకి అర్హులంటూ తుది జాబితా రూపొందించారు. రూ.145.63 కోట్లు రుణం పొందిన 28,260 మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులంటూ నిగ్గు తేల్చారు. అయితే ఇందులో నకిలీ పాసు పుస్తకాలతో రుణం పొందిన వారెందరు అనే వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. తుది జాబితా (అనెక్సర్ ఈ) రూపొందించిన తర్వాత కూడా జాబితాలో అనర్హులున్నారంటూ పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాల నుంచి అందుతున్న ఫిర్యాదులను పునః పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి అధికారులు తిరస్కరిస్తుండడం అనుమానాలకు దారి తీస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, గ్రామసభల్లో జాబితాను సమగ్రంగా చదవక పోవడం, బ్యాంకర్లు ఇచ్చిన జాబితా తప్పుల తడకగా ఉండటం, మొక్కుబడి తనిఖీలు తుది జాబితా తయారీపై ప్రభావం చూపాయి.
బ్యాంకర్ల తీరుపై అనుమానాలు
పంట రుణాలు పొందిన రైతుల వివరాలను బ్యాంకర్లు అసమగ్రంగా ఇవ్వడం వల్లే తనిఖీ మొక్కుబడిగా జరిగిందనే అరోపణలు వస్తున్నాయి. కేవలం జాబితాను ఇచ్చిన బ్యాంకర్లు రైతుల చిరునామాలు, తనఖా పెట్టిన పాసు పుస్తకాలు మాత్రం గ్రామసభలకు తీసుకు రాలేదు. దీంతో నకిలీ పాసు పుస్తకాల గుర్తింపు క్లిష్టంగా తయారైందని సామాజిక తనిఖీలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. చాలా మంది తమకున్న భూమి కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని చూపి రుణాలు పొందినట్లు కూడా తనిఖీల్లో వెల్లడైంది. రుణ వితరణలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ ఆఫీసర్ల సహకారంతోనే నకిలీలు రుణాలు పొందారనే ఆరోపణలున్నాయి. రుణమాఫీ జాబితాను మరోమారు సమగ్రంగా పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.