సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పంట రుణాల మాఫీకి అర్హత ఉన్న రైతుల సంఖ్య తేల్చడంలో బ్యాంకర్లు, అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రుణమాఫీకి అర్హత ఉన్న రైతులను గుర్తించి ఆగస్టు 31వ తేదీలోగా తుది జాబితా సిద్ధం చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే పంట రుణాలు పొందిన రైతుల వివరాలు ఇవ్వడంలో బ్యాంకర్లు గడువు పొడిగిస్తూ వస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు ఇచ్చిన జాబితాలో అర్హులను తేల్చేందుకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న సామాజిక తనిఖీ కూడా నత్తనడకన సాగుతోంది. వర్షాలు, సిబ్బంది కొరత, బ్యాంకర్ల సహాయ నిరాకరణతో సామాజిక తనిఖీ సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కొన్ని బ్యాంకులు సోమవారం సాయంత్రం వరకూ రుణాలు పొందిన రైతుల జాబితా ఇవ్వకపోవడంతో కలెక్టర్ ప్రియదర్శిని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు ఇప్పటివరకు అందజేసిన సమాచారం ప్రకారం 6,31,286 మంది రైతులు రూ.2906.71 కోట్లు రుణమాఫీకి అర్హత ఉన్నట్లు తేల్చారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సామాజిక తనిఖీ పూర్తయితేనే రుణమాఫీకి అర్హత ఉన్న రైతులు, మాఫీ అయ్యే మొత్తంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో మూడు రోజుల్లో సామాజిక తనిఖీ పూర్తి చేసి రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల తుది జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ ప్రియదర్శిని ‘సాక్షి’కి వెల్లడించారు.
‘పేట’ ఆర్డీఓకు నోటీసులు
జిల్లాలో 34బ్యాంకులు వాటి శాఖల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేయగా ఇప్పటివరకు 31 బ్యాంకులు మాత్రమే స్పందించాయి. బ్యాంకర్ల నుంచి పంట రుణాల పొందిన రైతుల జాబితా సేకరించేందుకు కలెక్టర్ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం జరిగిన బ్యాంకర్ల సమావేశంలోనూ రైతుల జాబితా ఇవ్వని బ్యాంకుల ప్రతినిధులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పటికీ ఇంకా వెనుకబాటుతనంతోనే ఉండాలని కోరుకుంటున్నారా?, రైతుల జాబితా ఇవ్వడంలో అభ్యంతరమేంటో చెప్పాలని’ కలెక్టర్ నిలదీశారు. జాబితాతో వస్తేనే సమావేశం జరుగుతుందని కలెక్టర్ తేల్చి చెప్పారు. దీంతో సోమవారం మూడు పర్యాయాలు వాయిదా పడిన సమావేశం సాయంత్రం మరోమారు జరిగింది. ఈ సమావేశంలో 31మంది బ్యాంకర్లు రైతుల వివరాలు అందజేశారు. రుణమాఫీ అంశంలో అసంబద్ధ సమాచారం ఇచ్చిన నారాయణపేట ఆర్డీఓ స్వర్ణలతకు మెమో జారీ చేయాల్సిందిగా డీఆర్‌ఓను ఆదేశించారు.
నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో రూ.620.47 కోట్ల మేర పంట రుణాల మాఫీ అయ్యే అవకాశముందని బ్యాంకర్లు నివేదిక ఇవ్వగా, ఆర్డీఓ మాత్రం రూ.757.51 కోట్ల మేర ఉంటుందని సమాచారం ఇవ్వడంపై కలెక్టర్ ఆగ్రహించారు. సామాజిక తనిఖీ పూర్తయితేనే రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల జాబితా, మాఫీ మొత్తం తేలుతుందని కలెక్టర్ ప్రియదర్శిని ‘సాక్షి’కి వెల్లడించారు. సామాజిక తనిఖీలో నకిలీ ఖాతాలు బయట పడుతున్న విషయాన్ని కలెక్టర్ ధ్రువీకరించారు.
లెక్క తేలలే..!
Published Tue, Sep 2 2014 2:47 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement