సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. అసైన్డ్ రైతులకు హక్కులిచ్చేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించిన ప్రభుత్వం దాన్ని అమలు చేసే దిశగా వేగంగా అడుగులేస్తోంది. అందులో భాగంగా జిల్లాల్లో అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చురుగ్గా వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ ఏడాది జూలై 31 నాటికి అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన భూముల వివరాలను వీఆర్‌వోలు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 27.41 లక్షల ఎకరాలపై హక్కులివ్వాలని ఇప్పటికే నిర్ణయించగా క్షేత్ర స్థాయిలో ఆ భూములను పరిశీలిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన..
ప్రతి రెవెన్యూ గ్రామంలో అసైన్డ్ భూములు అసైన్‌దారుల చేతుల్లో ఉన్నాయా, లేదా అనే విషయాన్ని వీఆర్‌వోలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పట్టాను పరిశీలించి ఆ పట్టాదారు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? అనే విషయాన్ని నమోదు చేస్తున్నారు.
సంబంధిత భూమి వారి ఆధీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఆ భూమి లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి డీకేటీ రిజిస్టర్లు, 1బీ అడంగల్, 22ఎ జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులు చూసి వాటికి తగ్గట్టు క్షేత్ర స్థాయి పరిస్థితి ఉందా లేదా?, వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయాలను నమోదు చేస్తున్నారు.
4 వేల గ్రామాల్లో పూర్తి..
ఇప్పటివరకు 4 వేల గ్రామాల్లోని 8 లక్షల ఎకరాల్లో వీఆర్‌వోలు వెరిఫికేషన్ పూర్తి చేశారు. తహశీల్దార్లు 2,600 గ్రామాల్లో తనిఖీలు పూర్తి చేయగా, ఆర్డీవోలు వెయ్యికి పైగా గ్రామాల్లో, జేసీలు 150కిపైగా గ్రామాల్లో వెరిఫికేషన్ ముగించారు. దీంతో తనిఖీలు పూర్తయిన గ్రామాల్లో తహశీల్దార్లు అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేస్తున్నారు. వీఆర్‌వోలు, తహశీల్దార్ల స్థాయిలో జరిగిన వెరిఫికేషన్‌ను ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు పరిశీలిస్తున్నారు.
ఈ నెలాఖరు నాటికి వెరిఫికేషన్‌ను పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవన్నీ తయారైన తర్వాత వచ్చే నెలలో పూర్తి స్థాయిలో తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. వారి నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు 22(ఎ) నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సిన భూముల జాబితాను పంపడానికి కసరత్తు జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment