సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వీఆర్వోలను దొంగలుగా చిత్రీకరించి 22 నెలల పాటు రోడ్డు పాల్జేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని లాటరీ పద్ధతిలో ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచి రెవిన్యూ వ్యవస్థపై కక్ష కట్టారని, అశాస్త్రీయమైన ధరణి వెబ్‌సైట్‌లోని తప్పులను ఎత్తిచూపుతారనే ఉద్దేశంతో వీఆర్వో వ్యవస్థను తొలగించారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసిన సీఎం... రెవిన్యూ శాఖలో కొనసాగుతున్న 7 వేల పైచిలుకు వీఆర్వోలను రోడ్డుపాలు చేశారని విమర్శించారు. భూస్వామ్య మనస్తత్వం కలిగిన కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని, 8 ఏళ్లుగా పెత్తందారీ దోరణితో పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచులకు అధికారాల్లేకుండా చేశారని, ఎంపీటీసీ, జడ్పీటీసీలను నామమాత్రంగా మార్చారని మండిపడ్డారు.
పంచాయతీరాజ్, రెవిన్యూ వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామ కార్యదర్శులకు మనశ్సాంతి లేకుండా చేస్తున్నారన్నారు. ఉన్నత విద్యావంతులైన వీఆర్వోలను తహసీల్దార్లుగా చేస్తానని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... అవినీతి సాకుతో వీఆర్వో వ్యవస్థనే నిర్మూలించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే జీవో నెంబర్ 121ను ఉపసంహరించుకోవాలని, వీఆర్వోలందరికీ పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment