ప్రహసనంగా రుణమాఫీ | AP CM asks banks to reschedule crop loans | Sakshi
Sakshi News home page

ప్రహసనంగా రుణమాఫీ

Published Fri, Nov 21 2014 2:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ప్రహసనంగా రుణమాఫీ - Sakshi

ప్రహసనంగా రుణమాఫీ

వీఆర్వోల చేతుల్లోనే జాబితాలు
నెల్లూరు(అగ్రికల్చర్): రుణమాఫీ వ్యవహారం ప్రహసనంగా మారింది. పాలకుల రోజుకోమాట.. పూటకో మెలికతో అన్నదాతలు గందరగోళానికి గురవుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నెల 10వ తేదీ నాటికి జాబితాలను పరిశీలించి, 15వ తేదీకల్లా అర్హుల జాబితా ప్రకటించి రైతుల ఖాతాల్లో 20 శాతం నగదును జమ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించడం లేదు.

బ్యాంకులు పంపిన ఖాతాల వివరాలు సరిగా లేవని ముప్పుతిప్పలు పెడుతోంది. జాబితాల పరిశీలన అనంతరం, జన్మభూమి కమిటీల ఆమోదం అంటూ మాట మార్చుతూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన చివరి గడువు గురువారంతో ముగిసింది. జాబితాలు తమకు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీఆర్వోల చేతుల్లోనే పరిశీలనా జాబితాలు ఉన్నట్లు సమాచారం. ఎక్కువ ఖాతాల విచారణ చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు.
 
మూడుసార్లు తీసుకున్నారు
రైతుల రుణమాఫీ సంబంధించిన వివరాల సేకరణ ప్రహసనంగా మారింది. జిల్లాలో ఎంతమంది పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కోసమంటూ ఇప్పటివరకు మూడు దఫాలుగా తీసుకున్న పత్రాలు బుట్టదాఖలేనని పలువురు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియను జాప్యం చేసేందుకే ప్రభుత్వం ఎన్నో రకాల షరతులు, లింకులు పెడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.ఈ ఏడాది మార్చి 31 వరకు జిల్లాలో 5,67,158 మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారు.

4,93,906 మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులని బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. గత ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు తీసుకున్న రూ. 3,093.02 కోట్లు పంట రుణాలు రద్దవుతాయని ఆశించారు. బంగారం తనఖా పెట్టి 2,20,625 మంది రైతులు రూ.921 కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నారు. బ్యాంకు అధికారులు పంపిన జాబితాలు సరిగా లేవని, వాటిని పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు పంపించారు. పరిశీలనకు పంపిన జాబితాలో 3.40 లక్షల మంది పేర్లు మాత్రమే ఉండటంతో మిగిలిన 1.5 లక్షల మంది రుణమాఫీకి అర్హులా, కాదా అనేది తేలాల్చి ఉంది.
 
అంతా గందరగోళం...
రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయకపోవడంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ నెల 8న తహశీల్దార్ కార్యాలయాలకు పంపిన జాబితా అర్హులదో.. అనర్హులదో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తొలుత 4,93,906 మంది అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం 3.4 లక్షల మంది పేర్లు మాత్రమే పరిశీలనకు తహశీల్దార్ కార్యాలయాలకు పంపడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 21వ తేదీకల్లా 20 శాతం జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఎవరికి జమ చేస్తుందో అర్థంకాని అయోమయ స్థితి నెలకొంది.
 పత్రాలు సమర్పించేందుకు
 
నానా పాట్లు...
రుణమాఫీకి సంబంధించి పలుమార్లు వివిధ పత్రాలను అందించేందుకు నానా పాట్లు పడినట్లు రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు రుణాలు పొందిన 4 లక్షల మందికి పైగా రైతులు బ్యాంకర్లకు, వీఆర్వోలకు ఇప్పటివరకు మూడుసార్లు పత్రాలు అందించారు. తొలిసారి బ్యాంకర్లకు 34 అంశాలకు సంబంధించి పలు పత్రాలు అందించగా, జాబితా వచ్చిన తర్వాత ఒకసారి, జాబితాలో నంబర్లు తీసుకున్న తర్వాత రెండోసారి వీఆర్వోలకు ఆధార్, ఓటరు కార్డులు ఇద్దరివి, రేషన్‌కార్డు, రుణ రసీదు కాపీలు అందజేశారు. వీటికి సంబంధించి పనులు మానుకొని మరీ కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగడానికి..జెరాక్స్‌లకు..చార్జీలతో కలిపి లెక్కేసుకుంటే ఒక్కొక్కరికీ రూ.500 పైగానే ఖర్చయ్యాయని చెబుతున్నారు.
 
స్పష్టత కరువు
* జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అవుతుంది? తొలిసారిగా అందించిన జాబితాలోని 4,93,906 మందికా? ఇటీవల తహశీల్దార్ కార్యాలయాలకు పంపిన 3.4 లక్షల మందికా అనేది స్పష్టత లేదు.
* తహశీల్దార్ కార్యాలయానికి పంపిన 3.4లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారనుకుంటే మిగిలిన 1,53,906 మంది రైతుల పరిస్థితి ఏమిటి?
* రెండో జాబితా వస్తుందని కొంతమంది తహశీల్దార్లు, వీఆర్వోలు, బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. నిజంగా రెండో జాబితా ఉంటుందా? ఉంటే ఎప్పుడు ప్రకటిస్తారు?
* రైతు రుణమాఫీకి, డ్వాక్రా రుణమాఫీకి లింకు పెడతారా? జన్మభూమి కమిటీలు నిర్ణయించిన టీడీపీ మద్దతుదార్లకే రుణమాఫీ ఉంటుందా?
* జాబితా పరిశీలనే పూర్తికాకుంటే 21న రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఖాతాలోకి 20 శాతం జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. జాబితాపై స్పష్టత లేనప్పుడు ఏ ఖాతాకు జమ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement