మాట నిలబెట్టుకోని చంద్రబాబు
నాది మునగపాక మండలం ఒంపోలు. వ్యవసాయ మదుపుల కోసం రూ.55వేలు రుణం తీసుకున్నాను. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక కేవలం రూ.50వేలుమాత్రమే రద్దు చేస్తామనడం విచారకరం. అదికూడా ఎప్పటి నుంచి అమలవుతుందో స్పష్టంగా చెప్పలేదు. వడ్డీతో అప్పు బాగా పెరిగిపోయింది. దీనికి తోడు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పంటల సాగుకు నానా ఇబ్బందులు పడుతున్నాం.
- నరాలశెట్టిసూర్యనారాయణ, రైతు
రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. దాని కోసం కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్న అన్నదాతలకు మళ్లీ నిరాశే ఎదురైంది. రోజుకో ప్రకటనతో కాలం గడిపేస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు తొలి విడత జాబితాను ఆదివారం విడుదల చేసింది. కానీ దానిలో తమ పేర్లు ఎక్కడున్నాయో అన్నదాతలకు కూడా తెలియకుండా మాయ చేసింది. జిల్లాలో ఎందరికి రుణమాఫీ అయిందో బయటపడకుండా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జాగ్రత్తపడింది. మొత్తంగా మసిపూసి మారేడుకాయ చేసింది.
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో రెండున్నర లక్షల మంది రైతులకు చెందిన 3.87లక్షల ఖాతాల పరిధిలో పంట, బంగారు రుణాలు కలిపి సుమారు రూ.3,800కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర లోపు రుణాల వరకు చూస్తే కనీసం రూ.2,200 వేల కోట్ల వరకు మాఫీ కావాల్సి ఉంది. వీటిలో పంట రుణాలు దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటాయి. అయితే ప్రస్తుతం 50 వేల లోపుపంట రుణాలు మాఫీ చేస్తామంటున్నారు.
దాని ప్రకారం జిల్లాలో 70వేల అకౌంట్ల పరిధిలోని 25వేల మంది రైతులకు రూ.400కోట్ల వరకు మాఫీ అవుతుందని అంచనా. ఈ నేపధ్యంలో ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితా ప్రకటిస్తుందని తెలిసినప్పట్నుంచీ రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 6న ఆన్‌లైన్‌లో అర్హుల జాబితా పెడతామని సీఎం ప్రకటించినప్పటికీ చెప్పిన సమయానికి విడుదల చేయలేదు. ఆదివారం ఆన్‌లైన్‌లో పెట్టామంటున్నప్పటికీ ఏ రైతుకి దానిలో స్పష్టమైన సమాచారం లేదు.
ఆధార్, రేషన్, బ్యాంక్ అకౌంట్ నంబర్లలో ఏదో ఓ దానిని ప్రభుత్వం నిర్దేశించిన వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే రుణమాఫీ గురించి సమాచారం తెలుస్తుందన్నారు. తీరా అవన్నీ చేశాక చూస్తే తొలి విడతలో ఎలాంటి వివరాలు లేవని కనిపిస్తోంది. ఇలా ఏ రైతు చూసుకున్నా ఒకటే సమాధానం వస్తోంది. దీంతో తొలి జాబితాలో తమ పేరు లేదేమోనని రైతులు ఆందోళనపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఏ బ్యాంకులో ఎన్ని అకౌంట్లకు, ఎంత మంది రైతులకు రుణమాఫీ అయ్యిందనే వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచలేదు. అంతేకాదు ఆ వివరాలేవీ బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులకు కూడా వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. దీంతో ఎవరిని అడిగినా మాకే స్పష్టత లేదంటున్నారు. ఎవరికి మాఫీ అయింది ఎవరికి కాలేదనే విషయాలు బహిర్గతమైతే తమ మాయలు, వంచనలు బయటపడతాయని భావించే టీడీపీ ప్రభుత్వం ఈ విధంగా చేసిందని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. సోమవారం అన్ని బ్యాంకుల వద్దకు వెళ్లి తమ రుణం మాఫీ అయిందోలేదో తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
మాయా మశ్చీంద్ర
Published Mon, Dec 8 2014 3:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement