సీబీఐ విచారణ జరిగితే కృష్ణలో మునుగుతారు | Cm Chandrababu warning to the farmers | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ జరిగితే కృష్ణలో మునుగుతారు

Published Tue, Apr 26 2016 2:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

సీబీఐ విచారణ జరిగితే కృష్ణలో మునుగుతారు - Sakshi

సీబీఐ విచారణ జరిగితే కృష్ణలో మునుగుతారు

 ‘అమరావతి’ రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘రాష్ట్ర రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని అడుగుతున్నారు. అదే జరిగితే భూములిచ్చిన రైతులు కృష్ణానదిలో మునగాల్సిందే. 20 ఏళ్లయినా ఆ విచారణ ఎటూ తేలదు. దీనివల్ల రాజధాని నిర్మాణం ఆగిపోతుంది. భూములు విచారణలో ఉండడం వల్ల రైతులు వాటిలో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాజధానిలో ఏ చిన్న ఆందోళన జరిగినా నష్టపోయేది రైతులే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోని ఒక గదికి ఆయన సోమవారం తెల్లవారుజామున ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. రైతులిచ్చిన భూములు అలాగే ఉన్నాయని, వారి వాటా ప్లాట్లు వారికి ఇస్తామని చెప్పారు. సచివాలయాన్ని ప్రారంభించి, అందులోకి ప్రవేశించిన తర్వాత రెండో విడత రైతు రుణమాఫీ కోసం రూ.3,200 కోట్లు మంజూరు చేసి, మే నెలలో డబ్బు విడుదల చేసే ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. పండ్ల తోటల రైతులకు రుణమాఫీ కింద రూ.375 కోట్లు, మొదటి విడత రుణమాఫీ బకాయిలు రూ.195 కోట్లను ఈ నెలలోనే విడుదల చేస్తామన్నారు. డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి కోసం రూ.2,400 కోట్లు మంజూరు చేసి, వాటిని జూన్‌లో ఇస్తామన్నారు. వీటన్నింటికి సంబంధించిన ఫైల్‌పై కొత్త సచివాలయంలో సంతకం చేశానని వెల్లడించారు. సారవంతమైన భూమిని రాజధానికి వాడుకోవడం వల్ల ఆహార సమస్య వస్తుందని కొందరు చెబుతున్నారని, ఇక్కడి నీటిని రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు.

 అమరావతికి వచ్చినవారికి 30 శాతం హెచ్‌ఆర్‌ఏ
 ‘‘రాజధానికి భూములిచ్చిన మెట్ట ప్రాంతాల్లోని రైతులు ఇంకా అదనంగా 50 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని అడుగుతున్నారు, ఆ మేరకు ఇస్తాం. వచ్చిన డబ్బును తాత్కాలిక ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టకుండా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు మాకు సహకరించాలి. వారిని సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకుంటాం. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినవారు గర్వపడేలా వారి భవిష్యత్తు ఉంటుంది. అమరావతికి వచ్చే ఉద్యోగులతో వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులే పనిచేయిస్తాం. వారికి 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తాం. మొదటి విడతగా ఒక సంవత్సరంలో ఐదు వేల ఇళ్లు కట్టించి ఇస్తాం. మిగిలిన వారికి తర్వాత ఎలా ఇళ్లు ఇవ్వాలో ఆలోచిస్తాం. పత్రికా విలేకరులకూ గౌరవనీయమైన స్థానం ఇస్తాం. వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. విలేకరులు పాజిటివ్ వార్తలు రాయాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 ఉత్తరం వైపున కుర్చీ
 సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషానికి ముఖ్యమంత్రి సచివాలయం నాలుగో బ్లాకులోని ఒక గదిలోకి రిబ్బన్ కత్తిరించి ప్రవేశించారు. అనంతరం విష్వక్సేన, వాస్తు పూజలు, గణపతి హోమంలో పాల్గొన్నారు. ఆ గదిలో ఉత్తరం వైపున ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని రెండోవిడత రుణమాఫీ నిధుల మంజూరు ఫైల్‌పై సంతకం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా పాలు పొంగించిన మహిళకు పట్టుచీర ఇచ్చారు. ఆ తర్వాత ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
 
 ఎవరైనా భూములివ్వాల్సిందే..  ఇవ్వకపోతే భూసేకరణే
  సభ ముగిసిన తర్వాత వెంకటపాలేనికి చెందిన రైతు మువ్వా నాగేశ్వరరావు తన భూమిని సమీకరణకు ఇవ్వాలనుకుంటున్నానని, మాట్లాడొచ్చా అని సీఎంను అడిగాడు. ఆయన అనుమతించడంతో నాగేశ్వరరావు మాట్లాడాడు. తాను వైఎస్సార్ సీపీ వాడినని, ఎకరం పొలం ఉంటే తన కూతురికి 30 సెంట్లు, కొడుక్కి 30 సెంట్లు ఇచ్చి తాను 30 సెంట్లు తీసుకున్నానని చెప్పాడు. ఈ భూమంతా తన పేరిటే ఉందని, కొంత  సమీకరణకు ఇచ్చానని, కానీ కౌలు ముగ్గురికీ కాకుండా ఒక్కరికే ఇస్తామంటున్నారని తెలిపాడు. కౌలు మూడు వాటాలుగా ఇస్తే మిగిలిన భూమిని కూడా సమీకరణకు ఇస్తానన్నాడు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఒక్కరి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేశారు. ఒక్కరికి వెసులుబాటు ఇస్తే గతంలో భూములిచ్చిన వారు ఇబ్బంది పడతారని చెప్పారు. ఎవరైనా సరే రాజధానికి భూములు ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే భూసేకరణ ద్వారా తీసుకుంటామని హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement