హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగపూర్ కంపెనీల కోసం ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని బలి చేయొద్దని సూచించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్థసారధి మీడియా సమావేశంలో మాట్లాడారు. అగ్రిజోన్ పేరుతో కృష్ణాజిల్లా రైతాంగానికి ఉరితాడులాంటి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన మండిపడ్డారు. 15 లక్షల ఎకరాల్లో 35ఏళ్ల పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
తుళ్లూరులో భూములకు మంచిరేట్లు రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తోందని పార్థసారధి విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాల్లో శాస్త్రీయత ఎంతమాత్రం ఉందని ఆయన ప్రశ్నించారు. మెట్ట ప్రాంతాల్లో అగ్రిజోన్ ఎలా సాధ్యమని, సింగపూర్ కంపెనీలకు లబ్ది చేయాలన్న ఉద్దేశంతోనే ఈ డ్రామా అంతా అని మండిపడ్డారు. రైతు తన హక్కును చట్టబద్ధంగా వినియోగించుకునే అవకాశం కూడా లేదా? ఏపీ రాజధాని నిర్మాణం ప్రజలకా లేక విదేశీయుల కోసమా అని ప్రశ్నలు సంధించారు.
చంద్రబాబు సర్కార్కు కోడిపందాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించినా ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా చెల్లించలేదన్నారు. ఆరు జిల్లాల్లో రూ.1200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీలో రైతాంగం తమ భవిష్యత్పై భయాందోళనకు గురవుతోందని పార్థసారధి అన్నారు. రబీకి వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై చంద్రబాబు నాయుడు చెప్పేవి తప్పులు లెక్కలని ఆయన వ్యాఖ్యానించారు.