ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక విభాగం
సుభాష్ పాలేకర్‌కు సన్మానం
సందర్భంగా సీఎం చంద్రబాబు
అమలాపురం/కాకినాడ రూరల్: ‘‘ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాను. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తాను. దీన్ని రైతులు ఉద్యమంగా చేపట్టాలి’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరంలో.. ప్రకృతి వ్యవసాయ ఉద్యమకర్త సుభాష్ పాలేకర్ నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులకు మంగళవారం సీఎం అతిథిగా హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం కోసం వ్యవసాయ శాఖలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని, ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రకృతి వ్యవసాయం ఆరంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను అందజేయమని పాలేకర్‌ను కోరారు. ఈ సందర్భంగా పాలేకర్‌ను ఘనంగా సత్కరించారు.
చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన రైతు
పిఠాపురం: సుభాష్ పాలేకర్ సాక్షిగా సీఎం చంద్రబాబుకు ఓ రైతు ఝలక్ ఇచ్చాడు. శిక్షణ తరగతుల సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై అభిప్రాయాలు చెప్పాలని కొందరు రైతులను వేదిక మీదకు పిలిచారు. విశాఖ జిల్లాకు చెందిన రైతు డోకల అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో ఆదాయం పెరిగిందని చెప్పారు. దీనికి సీఎం ‘‘అప్పులేమైనా ఉన్నాయా?’’ అని అడగ్గా.. గతంలో తాను వ్యవసాయం కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదని చెప్పారు. ‘‘నీకు రుణమాఫీ జరగలేదా?’’ అని ప్రశ్నిం చగా.. ‘‘ ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు’’ అని వాపోయాడు. శిక్షణకు వచ్చిన రైతులంతా చప్పట్లతో ఆయనకు మద్దతు పలకడంతో బాబు అవాక్కయ్యారు.