బక్క రైతు చిత్తు | Andhra Pradesh CM Chandrababu Naidu is cheating farmers | Sakshi
Sakshi News home page

బక్క రైతు చిత్తు

Published Fri, Jun 16 2017 5:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

బక్క రైతు చిత్తు - Sakshi

బక్క రైతు చిత్తు

చంద్రబాబు సర్కార్‌ కుటిల వ్యూహం...
పంటల బీమాతో పెట్టుబడి రాయితీకి లింకు.. బీమా ఉన్న వారికి పెట్టుబడి రాయితీ ఎగనామం

ఏదైనా హెక్టారుకు గరిష్టంగా రూ.15 వేలే
6 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం
రూ.500 కోట్లు నష్టపోనున్న రైతులు
జిల్లాల్లో బ్యాంకు రుణాల సమాచారం కోరిన వ్యవసాయ అధికారులు
బీమా వివరాల కోసమే పెట్టుబడి
రాయితీ పంపిణీ నిలిపివేత
సర్కారు మోసపూరిత నిర్ణయంపై
రైతులు, రైతు సంఘాల మండిపాటు


సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విపత్తు బాధిత రైతులకు రూ.2350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎగవేసిన చంద్రబాబు సర్కారు కరువు రైతులకు తాజాగా మరో రూ.500 కోట్లు శఠగోపం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టి కరువు పీడిత అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేయాలని ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగా 2016 ఖరీఫ్‌లో కరువు వల్ల పంట ఎండిపోయి పెట్టుబడులు కోల్పోయిన అన్నదాతలకు పెట్టుబడి రాయితీ లేదా పంటల బీమా.. రెండూ కలిపీ అయినా హెక్టారుకు గరిష్టంగా రూ.15 వేలు మాత్రమే చెల్లించాలని వ్యవసాయ అధికారులకు తాజాగా అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో జారీ చేస్తే అందరికీ తెలిసిపోయి రచ్చ రచ్చఅవుతుందనే భావనతో రహస్యంగా మెమో పంపించింది.

 దీంతో 2016 ఖరీఫ్‌లో పంటల సాగుకు పంట రుణాలు తీసుకున్న వారి వివరాల సేకరణలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. వాస్తవంగా పంటల బీమా, పెట్టుబడి రాయితీ రెండూ పొందడానికి రైతులు అర్హులే. ఇప్పటి వరకూ ఇలాగే పొందుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు సర్కారు ఈ రెండింటికీ లింకు పెట్టి బక్క రైతులకు అన్యాయం చేయడానికి ఒడిగట్టిందని వ్యవసాయ అధికారులు సైతం విమర్శిస్తున్నారు. పెట్టుబడి రాయితీని బీమాతో ముడిపెట్టి రైతులకు అన్యాయం చేయాలన్న ప్రభుత్వ ఎత్తుగడతో పంపిణీలోనూ జాప్యం జరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో పంట ఎండిపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడి రాయితీ విడుదల చేసి మూడు నెలలు దాటింది.

బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి రాయితీని అన్‌లైన్‌ ద్వారా జమ చేయాలంటూ ఆర్థిక శాఖ గత నెల 31వ తేదీన నిధులు విడుదల చేసింది. తక్షణమే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రాష్టంలోని 268 మండలాలకు చెందిన 13.21 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమ చేయాలని వ్యవసాయ కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఈ నెల ఒకటో తేదీన జీవో 67 జారీ చేసింది. ఇందు కోసం రూ.1680.05 కోట్లను వ్యవసాయ శాఖ కమిషనర్‌ పేరిట విడుదల చేసింది. ఈ జీవోలో ఎక్కడా పంటల బీమాతో ముడిపెట్టినట్లు ఒక్క అక్షరం కూడా లేదు. ఈ ఉత్తర్వులు వచ్చి 15 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం గమనార్హం.

పక్కా వ్యూహంతో సర్కారు కుట్ర
గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సగంపైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. సగం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉన్నా కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా 2016 అక్టోబరు 21, నవంబరు 12 తేదీల్లో 268 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కరువు మండలాల ప్రకటనలో అన్యాయం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర బృందం వచ్చి రాష్ట్రంలో కరువును పరిశీలించి వెళ్లింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కరువు మండలాల సంఖ్య 301కి చేరినా ప్రభుత్వం కేవలం 268 మండలాల రైతులకే పెట్టుబడి రాయితీ విడుదల చేయడం గమనార్హం.

వీరికైనా పంపిణీ చేసిందా అంటే లేదు. అంతర్గత ఉత్తర్వుల ద్వారా అందులో రూ.500 కోట్లు ఎగవేసేందుకు కుట్ర పన్నింది. దీనివల్ల కరువుల కాణాచిగా పేరొందిన రాయలసీమ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం అమలైతే ఒక్క అనంతపురం జిల్లా వేరుశనగ రైతులే రూ.370 కోట్లు పైగా పెట్టుబడి రాయితీని కోల్పోవాల్సి వస్తుందని అంచనా. ప్రస్తుతం విపత్తుల వల్ల వేరుశనగ పంట దెబ్బతింటే హెక్టారుకు రూ.15 వేలు పెట్టుబడి రాయితీ అమల్లో ఉంది. గత ఖరీఫ్‌లో వేరుశనగ పంట 90 శాతం పైగా ఎండిపోయింది. బీమా కంపెనీలు, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టారుకు గరిష్టంగా రూ.16000 చెల్లించాలని లెక్క కట్టారు.

 ఇందులో భాగంగానే గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించేందుకు బీమా సంస్థ రూ.576 కోట్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి హెక్టారుకు రూ.15 వేలు చెల్లించాలని నివేదికలు రూపొందించడం గమనార్హం. ఉదాహరణకు ఒక రైతుకు పంటల బీమా హెక్టారుకు రూ.10 వేలు వచ్చిందనుకుంటే దానికి రూ.5 వేలు (రూ.15 వేలు బదులు) పెట్టుబడి రాయితీ కలిపి 15 వేలు చెల్లిస్తారు. బీమానే రూ.15 వేలు వస్తే పెట్టుబడి రాయితీ అసలు ఇవ్వరు. దీనివల్ల రాష్ట్రంలో ఆరు లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరుగనుంది. ఈ విషయం వ్యవసాయ అధికారుల ద్వారా తెలియడంతో ప్రభుత్వంపై రైతు సంఘాల నేతలతోపాటు రైతులు మండి పడుతున్నారు.

వేరుశనగ రైతులకు అన్యాయం
రాష్ట్రంలో గత ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 9.30 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగైంది. ఇందులో అనంతపురం జిల్లాలో 6.10 లక్షలు, కర్నూలులో 1.14 లక్షలు, చిత్తూరులో 1.34 లక్షల హెక్టార్లు ఉంది. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు వేరుశనగ పంటల బీమా కింద రూ.576 కోట్లు మంజూరైంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 5.22 లక్షల మంది పంటల బీమా ప్రీమియం చెల్లించారు. మిగిలిన మూడు జిల్లాలు కలిపితే పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతుల సంఖ్య ఆరు లక్షలు పైగా ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం వీరికి పంటల బీమా, పెట్టుబడి రాయితీ రెండూ చెల్లించాలి.

ఉదాహరణకు గత ఏడాది అనంతపురం జిల్లాలోని మొత్తం 63 మండలాలు కరువు ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. అందువల్ల ఈ జిల్లాలో 6.10 లక్షల హెక్టార్లకు పెట్టుబడి రాయితీ కింద సుమారు రూ.913 కోట్లు అవుతుంది. ఈ జిల్లాలో బీమా ప్రీమియం చెల్లించిన వేరుశనగ రైతులకు రూ.415 కోట్లు పంటల బీమా కింద చెల్లించాల్సి ఉంది. వీటి రెండింటినీ వేర్వేరుగా ఇస్తే అనంతపురం జిల్లా రైతులకు రూ.913 కోట్ల పెట్టుబడి రాయితీ, రూ.415 కోట్లు పంటల బీమా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుకున్నట్లు కలిపి ఇస్తే రైతులకు రూ.370 కోట్లు పైగా తగ్గిపోతుందని అనధికారిక అంచనా. రెండింటినీ కలపడమంటే బీమా చేసిన వారిని, చేయని వారిని ఒకే గాటన కట్టినట్లవుతంందని, ఇది సరికాదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంటున్నారు.

సీఎం సమక్షంలోనే నిర్ణయం
పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టడం ద్వారా రైతులకు అన్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గ్రామసభల అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2016 ఖరీఫ్‌ సీజన్‌కు కరువు రైతులకు పెట్టుబడి రాయితీ పంపిణీకి మార్గాదర్శకాల ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశం మేరకు గ్రామసభలు నిర్వహించాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆ శాఖ సంయుక్త సంచాలకులకు (జేడీలకు) ఈనెల 13వ తేదీన మెమో జారీ చేశారు. విపత్తు బాధిత రైతులకు పంటల బీమా పరిహారంతో సంబంధం లేకుండా నేరుగా పెట్టుబడి రాయితీ పంపిణీ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా ఈ రెండింటికీ ముడిపెడుతున్నట్లు మెమోలో పేర్కొన్నారు.

 ‘రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో పంటల బీమా పరిహారం మొత్తాలను మొదట తీసుకోవాలి. ఒక రైతుకు హెక్టారుకు రూ.15 వేల లోపు పంటల బీమా పరిహారం వచ్చి ఉంటే పెట్టుబడి రాయితీ ఖాతా నుంచి మిగిలిన మొత్తాన్ని డ్రా చేసి గరిష్టంగా రెండు హెక్టార్లకు ఇవ్వాలి’ అని మెమోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఉదాహరణకు వేరుశనగ సాగు చేసిన రైతు సొంత జేబు నుంచి పంటల బీమా ప్రీమియం చెల్లించారనుకుందాం. పంట నష్టపోయినందుకు ఆయనకు హెక్టారుకు రూ.20 వేలు పంటల బీమా పరిహారం వచ్చింటే తర్వాత ప్రభుత్వం పైసా కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వదు.

దీనిని ఎగవేస్తుందన్న మాట. వాస్తవ నిబంధనల ప్రకారం పంటల బీమా పరిహారం పొందిన రైతులకు దీనితో సంబంధం లేకుండా ప్రభుత్వం పెట్టుబడి రాయితీ మొత్తాన్ని ఇవ్వాలి. ఖరీఫ్‌ సీజన్‌లో రాయలసీమ రైతులు సాగు చేసిన పంటలకే పంటల బీమా ఉంది. అందువల్లే ప్రభుత్వం మెమోలో రాయలసీమ రైతులకు మొదట పంటలబీమా డేటా తీసుకోవాలని పేర్కొంది. మిగిలిన శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పెట్టుబడి రాయితీ నేరుగా యథా ప్రకారం పంపిణీ చేయాలని మెమోలో పేర్కొనడం గమనార్హం. దీనిని బట్టే పంటల బీమా వచ్చిన వారికి పెట్టుబడి రాయితీ ఎగవేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తేటతెల్లమవుతోంది.  





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement