సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రకృతిని కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. 8 మిలియన్ల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానం ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఐక్యరాజ్యసమితి సదస్సుల్లో ‘సుస్థిర సేద్యం–ఆర్థిక చేయూత–అంతర్జాతీయ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 28 శాతం వ్యవసాయ రంగానిదేనని అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే జీవనాధారమని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘వ్యవసాయం అంటే అత్యధిక వ్యయం, శ్రమతో కూడుకున్నది. భూసారం క్షీణించి పర్యావరణం దెబ్బతింటుంది. ఉత్పత్తి, మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నవి. పంటలు సరిగ్గా పండక గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుంటారు. వాతావరణ మార్పులతో కరవు కాటకాలు, వరదలు సంభవిస్తుంటాయి. ఈ దుష్ప్రభావాలను అధిగమించడానికే ప్రకృతి వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను) ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి సేద్యంలో మీరు ఒక డాలర్ పెట్టుబడి పెట్టినట్లయితే 13 డాలర్ల లాభం వస్తుంది. రసాయన ఎరువులతో వచ్చే దుష్ప్రభావాలు మేం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయంతో తొలగిపోతున్నాయి. సురక్షితమైన, మిక్కిలి పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి సాధ్యమవుతోంది.
వ్యవసాయాన్ని మేము లాభసాటిగా తీర్చిదిద్దడంతో ఐటీ నిపుణులు ఆ రంగంవైపు ఆసక్తి చూపుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. యువతను వ్యవసాయం వైపు ఆకర్శిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారోత్సత్తులు తీసుకుంటుండటంతో తమ ఆరోగ్యం బాగుపడిందని ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో రైతాంగాన్ని 100 శాతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు, 2022 నాటికి 4.1 మిలియన్ల రైతులను ఈ సేద్యం వైపు మళ్లించాలన్నదే మా ధ్యేయం.
కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా..
20 ఏళ్ల క్రితం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు 9 లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి. వీరంతా తమ గ్రామాలు దాటి తమ భాష రాని, తమ ప్రాంతం కాని ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన కలిగిస్తున్నారు. భూమి ఉపరితలంపై కురిసే వర్షపు నీటిని రియల్ టైమ్ మేనేజ్‌మెంట్ ద్వారా ఒడిసి పడుతున్నాం, భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అల్పపీడనాలు ఏర్పడి అవి తుపానులుగా మారి ఎక్కడ కేంద్రీకృతమయ్యాయో రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థతో చెప్పగలుగుతున్నాం. న్యూయార్క్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో వీధిలైట్ల వ్యవస్థను నేను రియల్ టైమ్ వ్యవస్థ సహాయంతో నిర్వహించగలను. నాకు సీఎం కోర్ డ్యాష్‌బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా. మీరు అందులోని అంశాలన్నీ చూడొచ్చు’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment