సీఎం జగన్ పాలనలో వ్యవసాయానికి నాణ్యమైన పంపుసెట్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయమే దండగన్న చంద్రబాబు పాలనలో కాలం చెల్లిన ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల వ్యవసాయ మోటార్లు పదే పదే కాలిపోయేవి. సరిగ్గా విద్యుత్ సరఫరా లేక.. నీరు అందక పంటలు ఎండిపోయేవి. అదే చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ పంపుసెట్ల నాణ్యత పెంచుతానంటూ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా.. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కాపీ కొట్టేసి మరీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంపుసెట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వ్యవసాయంతో పాటు మున్సిపాలిటీలు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా విద్యుత్ ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చడం ద్వారా పంపుసెట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది.
కొత్త సాంకేతికతతో మోటారు తయారీ..
వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటీరియర్ పరి్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్(ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ‘ఎనర్జీ ఎఫీషియెంట్ సబ్‌మెర్సిబుల్ మోటార్’ను ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ తయారు చేసింది. దీని ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) నిధులతో తొలుత కొన్ని వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికత ప్రయోగాత్మక అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చేపట్టింది.
ఐపీఎంఎస్ మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయం. పవర్ ఫ్యాక్టర్ మెరుగుదలకు, మోటారు మన్నికను పెంచడానికి దోహదపడతాయి. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లు కాగా.. ఐపీఎంఎస్ మోటారు సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుంది. ఇండక్షన్ మోటారుతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది.
టీటీడీ, మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ ఆదా పంపుసెట్లు
ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ సామర్థ్య సాంకేతికతలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల.. విద్యుత్ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా టీటీడీలోని పాత పంప్‌సెట్ల స్థానంలో ఈ ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చుతోంది.
అలాగే ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వినియోగిస్తున్న మోటార్ల స్థానంలో విద్యుత్‌ను ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లను అమర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూనుకుంది. దీనిపై మున్సిపల్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయ మోటార్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించే వెసులుబాటు కలిగింది.
ఇప్పటికే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఫీడర్లను ఆధునీకరించింది. వాటి ద్వారా మోటార్లకు వెళ్లే విద్యుత్‌లో ఇంకా ఏవైనా లోపాలుంటే స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుసుకుని వెంటనే సరిచేయడం ద్వారా పంపుసెట్ల నాణ్యత పెరుగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఇంత చేస్తుంటే.. అధికారంలో ఉండగా ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు మోసపూరిత హామీలతో మరోసారి రైతులను, ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment