ధాన్యం తేమ శాతంలో తేడాలొస్తే చర్యలు
సీఎం చంద్రబాబు
సాక్షి, మచిలీపట్నం/పెనమలూరు: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను అందుబాటులోకి తెచ్చి రైతులు మంచి ఆదాయం పొందేలా చూస్తామని, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి పూర్తిన్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు.
గంగూరు రైతు సేవాకేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పులు జరగకూడదన్నారు. తేమ శాతంలో కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. తేమ శాతం సమస్య పరిష్కరించేందుకు డ్రైయ్యర్లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే మొబైల్ డ్రైయర్లను పొలాల వద్దే అందుబాటులో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.
ఎరువులు, పురుగు మందులు అధిక మోతాదులో వాడొద్దన్నారు. డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయని, మొబైల్ యాప్ ద్వారా పంటలో పురుగుల మందు, ఎరువులు ఎక్కడ వాడాలో తెలుసుకుని డ్రోన్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో సమస్య అధిగమించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ధాన్యం డబ్బును 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. మిల్లర్లు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలన్నారు.
దళారులు లేకుండా రైతులకు న్యాయం చేస్తామని, అవసరమైతే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. సాగునీటి కాలువలు మురుగుతో పూడుకుపోయాయని, పంటలకు నీళ్లందటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, టార్పాలిన్లు ఇవ్వాలని కోరారు.
రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని, గోనె సంచుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం రవాణాకు వాహనాలు జాప్యం లేకుండా ఏర్పాటు చేయాలని, తమలపాకు తోటలకు సబ్సిడీపై కర్రలు ఇవ్వాలని కోరారు.
సెంటు భూమి పోయినా ఇప్పిస్తాం
అన్ని హక్కులు ఉండి సెంటు భూమి పోయినా ఇప్పించే బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈడుపుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూకబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిందన్నారు.
ఇప్పటివరకు 1.57 లక్షల అర్జీలు తనకు వచ్చాయని, రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 దరఖాస్తులు, ఇంటి జాగా కోసం 9,830, ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులు 9,528, ప్రభుత్వ భూమి కోసం 8,366 ఆక్రమణలకు సంబంధించి 8,227, అధికారులపై 8 వేలు ఫిర్యాదులు వచ్చాయని సీఎం వివరించారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి, రాజముద్ర ఉండాల్సిన చోట వైఎస్ జగన్ సొంత బొమ్మ వేసుకున్నారన్నారు.
ప్రజల్లో ఆందోళన కారణంగా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. గతంలో భూమిని కబ్జా చేసినా, 22ఏలో పెట్టినా, భూమి మీది కాదని చెప్పినా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. 6,698 గ్రామాల్లో రీసర్వే చేయగా తప్పుడు సర్వే జరిగిందంటూ దాదాపు 2,79,148 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment