సాక్షి, హైదరాబాద్: ఇతర ప్రభుత్వ శాఖల్లో వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇది పిటిషనర్ల (19 మంది)కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ జీవో నంబర్ 121ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ జీవో చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లఘించినట్లేనని పేర్కొంటూ.. పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టుల్లో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖలో ఆ మేరకు ఖాళీలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటినర్ తరఫున అడ్వొకేట్ ఫణి భూషణ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే 90 శాతం సర్దుబాలు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ సమయంలో స్టేటస్ కో విధించడం సరికాదన్నారు. వారు రెవెన్యూ శాఖలోనే పని చేస్తామని పట్టుబట్టడం కూడా చట్టవిరుద్ధమని వెల్లడించారు. అంతకు ముందు స్టేటస్ కో వీఆర్వోలందరికీ వర్తిస్తుందని చెప్పిన ధర్మాసనం.. ఏజీ వాదనల తర్వాత దాన్ని పిటిషనర్లకు మాత్రమే వర్తింపజేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment