Village Revenue Officer
-
AP Govt: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)కు ప్రభుత్వం భరోసానిచ్చింది. సర్వీస్‌లో ఉన్న గ్రేడ్–1, 2 వీఆర్వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. దీంతో గ్రేడ్–1, 2 వీఆర్వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన భాగస్వామి/పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్‌కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. కారుణ్య నియామకాలపై వీఆర్వోలు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం వీఆర్వోల డిమాండ్‌ను పట్టించుకోలేదు. సీఎం జగన్ సర్కార్.. వీరి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని వీఆర్వోల సుదీర్ఘ కాల డిమాండ్‌ను నెరవేర్చింది. దీనిపై ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (ఏపీ టెట్ ఫలితాలు విడుదల) -
ఔట్ సోర్సింగ్‌కు సర్దుబాటు షాక్!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎన్నో ఏళ్లుగా సొసైటీల పరిధిలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో)ల సర్దుబాటు రూపంలో ప్రమాదం వచ్చిపడింది. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ.. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరిని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఆదేశించింది. శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్దేశిస్తూ వారికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించడంతో చర్యలకు దిగిన ఉన్నతాధికారులు ఖాళీలను బట్టి పోస్టింగులు ఇస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియమిస్తున్నారా? లేక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో 65 మందికి.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో 65 మంది వీఆర్వోలకు ఈ విధంగా పోస్టింగులిస్తూ సొసైటీ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని వివిధ గురుకుల విద్యా సంస్థల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పొస్టుల్లో వారిని సర్దుబాటు చేశారు. ఇలా సర్దుబాటు చేసిన పోస్టుల్లో చాలావరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులుండడం గమనార్హం. కాగా మిగతా సొసైటీల్లోనూ ఈ విధంగా అతి త్వరలో వీఆర్వోలకు పోస్టింగులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆందోళనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గురుకుల విద్యా సంస్థల్లో వీఆర్వోల సర్దుబాటుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో నియమితులైన 65 మంది వీఆర్వోలు శాశ్వత ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాల్సి రావచ్చు. తాజాగా సర్దుబాటైన వీఆర్వోలు తక్షణమే జిల్లా అధికారికి రిపోర్టు చేయాలని ఉత్పర్వుల్లో స్పష్టం చేయడంతో మెజార్టీ ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పది నుంచి పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను ఒక్కసారిగా విధుల్లోంచి తీసేస్తే భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వయోభారం కారణంగా కొత్తగా తమకు ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితి ఉండదని, అందువల్ల ఒకవేళ తమను ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి వస్తే ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని వారు కోరుతున్నారు. అయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా మిగతా సొసైటీల్లో సైతం ఇదే తరహాలో వీఆర్వోల నియామకాలు చేపట్టే అవకాశం ఉండటంతో, ఆయా సొసైటీల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా సొసైటీనే నమ్ముకుని ఉన్న వారిని తొలగిస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. మానవీయ కోణంలో ఆలోచించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా.. వీఆర్వోలను సర్దుబాటు చేయాలి. ఈ అంశాన్ని ఇప్పటికే సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం -
వీఆర్వోల విలీన ప్రక్రియపై స్టేటస్ కో.. అయితే ఇది అందరికీ కాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఇతర ప్రభుత్వ శాఖల్లో వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇది పిటిషనర్ల (19 మంది)కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ జీవో నంబర్ 121ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లఘించినట్లేనని పేర్కొంటూ.. పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టుల్లో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖలో ఆ మేరకు ఖాళీలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటినర్ తరఫున అడ్వొకేట్ ఫణి భూషణ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే 90 శాతం సర్దుబాలు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ సమయంలో స్టేటస్ కో విధించడం సరికాదన్నారు. వారు రెవెన్యూ శాఖలోనే పని చేస్తామని పట్టుబట్టడం కూడా చట్టవిరుద్ధమని వెల్లడించారు. అంతకు ముందు స్టేటస్ కో వీఆర్వోలందరికీ వర్తిస్తుందని చెప్పిన ధర్మాసనం.. ఏజీ వాదనల తర్వాత దాన్ని పిటిషనర్లకు మాత్రమే వర్తింపజేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. మరోవైపు కాలం చెల్లిన చట్టాలకు స్వస్తిచెప్పి కొత్త రెవెన్యూ చట్టం తేనుందనే ప్రచారం జరిగినా ప్రస్తుతం అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కులు–1971 చట్టం స్థానే.. తెలంగాణ భూ యాజమాన్య హక్కులు–పట్టాదార్ పాస్‌పుస్తకాల బిల్లు–2020’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు రానుంది. రెవెన్యూ సిబ్బందికి అధికారాల కత్తెర, హోదాల మార్పు, కొత్త విభాగాల కూర్పుతో ఈ చట్టానికి రూపకల్పన చేసిన సర్కారు.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. మొదట్నుంచి ఈ వ్యవస్థపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం వీఆర్వోలపై వేటు వేసింది. అందులో భాగంగా సోమ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో వీఆర్వోలపై మెడపై కత్తివేలాడుతున్నట్లు తేటతెల్లమైంది. రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం! అవినీతి రహితంగా, వివాదాలకు తావివ్వకుండా రెవెన్యూ సేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పట్టాదార్ పుస్తకం జారీ అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుత విధానం వల్ల అవినీతి, వివాదాలకు ఆజ్యం పోస్తుందని భావించిన సర్కారు.. నోటీసులు, విచారణలు, రికార్డుల అప్డేషన్, ఆన్లైన్ పేరిట కాలయాపన చేయకుండా అదే రోజు పాస్‌పుస్తకం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అధికారాల బదలాయింపు, వికేంద్రీకరణతో ఇరుశాఖలు ఏకీకృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి మండలంలో తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్ ఒకరే ఉండనున్నారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలపై ఇరు శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలావుండగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు, వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ చేస్తారనే మరో ప్రచారం కూడా ఉంది. వీఆర్వో ఎందుకొద్దంటే.. గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపై కసరత్తు చేసింది. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారాల్లో సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పహాణీలో కాస్తు కాలమ్ ఎత్తివేసిందున.. కాస్తు కాలమ్‌ను గ్రామస్థాయిలో నమోదు చేసే వీఆర్వో వ్యవస్థ అవసరంలేదనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీంట్లో భాగంగా 1985, 1991ల్లో తీసుకువచ్చిన చట్ట సవరణలకు కొనసాగింపుగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేయాలని నిర్ణయించింది. మరోవైపు వీఆర్వోలు, వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లను పురపాలక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో విలీనం చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, వీఆర్ఏలలో కొందరిని మాత్రం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. తహసీల్దార్‌తో లింకు తెగిపోకుండా కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
వీఆర్వో పరీక్షకు 78 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 78.46 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 700 పోస్టుల భర్తీకి జరిగిన ఈ పరీక్షకు 10,58,387 మంది దరఖాస్తు చేసుకోగా 7,87,049 మంది పరీక్ష రాశారని టీఎస్పీఎస్సీ తెలిపింది. వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 83 శాతం మంది, వికారాబాద్ జిల్లాలో అతి తక్కువగా 29 శాతం మంది హాజరయ్యారని వెల్లడించింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 73,681 మంది (74.06 శాతం), రంగారెడ్డి జిల్లాలో 64,209 మంది (74.89 శాతం), మేడ్చల్‌లో 68,499 మంది (75.09 శాతం) పరీక్ష రాశారు. ఇష్టం వచ్చినట్లు కేంద్రాల కేటాయింపు దరఖాస్తు సమయంలో ఎంచుకున్న జిల్లాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన కొంతమందికి ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కేటాయించడంతో పరీక్షకు హాజరు కాలేకపోయారు. హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు సామర్థ్యానికి మించి అభ్యర్థులు ఆప్షన్ ఇవ్వడంతో అనేక మందికి ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించారు. పరీక్ష కేంద్రం మారిందంటూ.. పరీక్ష సందర్భంగా కొన్ని చోట్ల అభ్యర్థులు తంటాలు పడాల్సి వచ్చింది. కొందరికి ‘మీ పరీక్ష కేంద్రం మారింది.. మారిన ప్రకారం హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోండి’అని సమాచారం రావడంతో గందరగోళం నెలకొంది. 1340077047 నంబరు గల అభ్యర్థి రెండు రోజుల కిందట హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ‘మీ పరీక్ష కేంద్రం మారింది.. మారిన ప్రకారం హాల్‌టికెట్ ఇంకా డౌన్లోడ్ చేసుకోండి.. ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే ఈ మెసేజ్‌ను వదిలేయండి’అని శనివారం మధ్యాహ్నం 12:20 గంటలకు ఎస్ఎంఎస్ వచ్చింది. మళ్లీ మధాహ్నం 1.09 గంటలకు.. ‘మీకు ముందుగా ఇచ్చిన పరీక్ష కేంద్రాన్ని (విజేత స్కూల్ తుర్కపల్లి, శామీర్‌పేట్ మండలం) మార్పు చేశాం.. మూసారాంబాగ్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ ఫర్ గరŠల్స్ కేంద్రాన్ని కేటాయించాం.. మారిన కేంద్రం ప్రకారం హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోండి..’అని సమాచారం వచ్చింది. కానీ ఆ అభ్యర్థి ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసినా తుర్కపల్లి పరీక్ష కేంద్రం ఉన్న హాల్టికెటే వచ్చింది. దీనిపై టీఎస్పీఎస్సీ టెక్నికల్ టీం, హెల్ప్ డెస్క్‌కు అనేకసార్లు ఫోన్ చేసినా కలవలేదు. కలసినా ఫోన్ తీయలేదు. దీంతో సదరు అభ్యర్థి మారిన కేంద్రానికి వెళ్లగా అక్కడ తన నంబరు లేదు. తనలా చాలా మంది ఉండొచ్చని సదరు అభ్యర్థి అన్నారు. తాళి తీయించి పరీక్షకు.. తనిఖీల పేరుతో పలు కేంద్రాల్లోని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా అభ్యర్థుల వాచ్‌లు, గాజులు.. చివరకు మెడలోని తాళినీ తీయించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మహిళలను తాళి తీసేసిన తర్వాతే పరీక్షకు అనుమతించడంతో అభ్యర్థుల బంధువులు కేంద్రం ఎదుట తాళిబొట్లు పట్టుకుని నిరసనకు దిగారు. పోలీసుల జోక్యంతో తాళి, మెట్టెలతో హాలులోకి అనుమతించారు. అనేక మంది మహిళలు చంటి బిడ్డలతో పరీక్షకు హాజరయ్యారు. కేంద్రాల ముందు కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడంతో మధ్యాహ్నమంతా చిన్నారులను ఎత్తుకుని ఎండలోనే గడపాల్సి వచ్చింది. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
నెల్లిమర్ల : మండలానికి చెందిన గ్రామరెవెన్యూ అధికారి(వీఆర్వో) ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టాదారు పాస్‌పుస్తకం కోసం రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాక్షాత్తూ రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో నెల్లిమర్ల పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి అందించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన లెంక అప్పలరాజు.. తన పెద్దమ్మ లెంక నారాయణమ్మ ఇచ్చిన 99 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం సుమారు ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏవో కారణాలు చూపించి గ్రామరెవెన్యూ అధికారి తిరస్కరించాడు. అనంతరం అప్పలరాజు మరో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో పాస్‌పుస్తకం మంజూరు చేసేందుకు రైతు అప్పలరాజును వీఆర్వో మజ్జి యేసు రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రైతు అప్పలరాజు ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. వారి సూచనల మేరకు తహసీల్దారు కార్యాలయంలోనే సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి ఆధ్వర్యంలో సీఐలు లక్ష్మోజీ, రమేష్ తదితరులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో యేసుపై కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
సదాశివపేట (రంగారెడ్డి జిల్లా): రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మోమిన్‌పేట మండలం దుర్గంచెరువు గ్రామ వీఆర్వో చంద్రయ్య (50), అదే గ్రామానికి చెందిన అంజయ్య గురువారం రాత్రి 7.30 సమయంలో సదాశివపేట నుంచి దుర్గంచెరువుకు బైక్‌పై వెళ్తున్నారు. వికారాబాద్ రోడ్డు కొత్తచెరువు సమీపంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన చంద్రయ్యను 108 వాహనంలో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రయ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు తెలిపారు. -
ఏసీబీ చెరలో వీఆర్ఓ
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా వంగూర్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామ వీఆర్ఓ భీమయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలు...నిజామాబాద్‌కు చెందిన మక్సూద్ అనే వ్యక్తికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడానికి రూ. 5000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో దిక్కుతోచని మక్సూద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో మక్సూద్ నుంచి భీమయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. (వంగూర్) -
హత్య చేసి.. తగలబెట్టి..
* చినరావుపల్లిలో దారుణం * రంగంలోకి దిగిన పోలీసులు * మృతుని వివరాలు సేకరణ.. * నిందితుల కోసం నాలుగు బృందాలు * సంచలనం రేకెత్తించిన సంఘటన ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురం పరిధిలోని చినరావుపల్లిలో దారుణం జరిగింది.గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేశారు. మృతదేహం సగంసగం కాలి గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బుధవారం సాయంత్రం గ్రామంలో కాలిపోయిన గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గ్రామ రెవెన్యూ అధికారి జరుగుళ్ల వెంకటరమణమూర్తికు తెలియజేయ గా అతని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతదేహాన్ని వాహనంలో గోనె సంచిలో పెట్టి తీసుకొచ్చి బయటకు తీయకుండానే కిరోసిన్,పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. మృత దేహానికి నిప్పు అంటించాక నిందితులు అక్కడ నుంచి పరారై ఉంటారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం డీఎప్సీ కె.భార్గవ నాయుడు, క్లూస్ టీం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పరిశీలించి తలపై గాయాలు ఉన్నట్టు డీఎస్పీ గుర్తించారు. క త్తితో నరికి చంపి ఉంటారని.. మృతి చెందిన వ్యక్తి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ నేర సంఘటనలో ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండి ఉంటుం ది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారి పక్కనే.. మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతం ఆర్అండ్బీ రహదారికి అనుకొని కిలోమీటరు దూరంలో ఉంది. ఆ పక్క నుంచే కాలిబాట ఉంది. ఆర్అండ్బీ రహదారి నుంచి లావేరు మండలం బయ్యన్న పేట, మురపాక తదితర గ్రామాలకు ఈ దారి గుండా రాకపోకలు సాగి స్తారు. ఆ సమీపంలోనే షిర్డీసాయి ఆలయం కూడా ఉంది. ఎక్కడా మిస్సింగ్ కేసులు లేవు.. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల పోలీసుస్టేషన్ల పరిధిలో ఎక్కడ ఈ మధ్యకాలంలో అదృశ్యం కేసులు కూడా నమోదు కాలేదని డీఎస్పీచెప్పారు. మృత దేహం ఎవరిది అన్న మిస్టరీ వీడితే నిందితుల వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు. మృతుని ఆచూకీ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దహనం జరిగిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో గతంలో పలువురి ఆత్మహత్య చినరావుపల్లి ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో గతంలో పలు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. వందల ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉండటం..జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ ప్రేమ జంట ఇదే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే మరో ఇద్దరు జీడి మామిడి చెట్లకు ఊరిపోసుకుని మృతిచెందారు. జన సంచారం పెద్దగా లేని కారణంగా సంఘటన జరిగి రోజులు గడిచాక విషయం బయటకు వస్తోంది.