ఏసీబీ వలలో వీఆర్‌ఓ
నెల్లిమర్ల : మండలానికి చెందిన గ్రామరెవెన్యూ అధికారి(వీఆర్వో) ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టాదారు పాస్‌పుస్తకం కోసం రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాక్షాత్తూ రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో నెల్లిమర్ల పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి అందించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన లెంక అప్పలరాజు.. తన పెద్దమ్మ లెంక నారాయణమ్మ ఇచ్చిన 99 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం సుమారు ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏవో కారణాలు చూపించి గ్రామరెవెన్యూ అధికారి తిరస్కరించాడు.
అనంతరం అప్పలరాజు మరో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో పాస్‌పుస్తకం మంజూరు చేసేందుకు రైతు అప్పలరాజును వీఆర్వో మజ్జి యేసు రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రైతు అప్పలరాజు ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. వారి సూచనల మేరకు తహసీల్దారు కార్యాలయంలోనే సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి ఆధ్వర్యంలో సీఐలు లక్ష్మోజీ, రమేష్ తదితరులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో యేసుపై కేసు నమోదు చేశారు.