సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. మరోవైపు కాలం చెల్లిన చట్టాలకు స్వస్తిచెప్పి కొత్త రెవెన్యూ చట్టం తేనుందనే ప్రచారం జరిగినా ప్రస్తుతం అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కులు–1971 చట్టం స్థానే.. తెలంగాణ భూ యాజమాన్య హక్కులు–పట్టాదార్ పాస్‌పుస్తకాల బిల్లు–2020’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు రానుంది. రెవెన్యూ సిబ్బందికి అధికారాల కత్తెర, హోదాల మార్పు, కొత్త విభాగాల కూర్పుతో ఈ చట్టానికి రూపకల్పన చేసిన సర్కారు.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. మొదట్నుంచి ఈ వ్యవస్థపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం వీఆర్వోలపై వేటు వేసింది. అందులో భాగంగా సోమ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో వీఆర్వోలపై మెడపై కత్తివేలాడుతున్నట్లు తేటతెల్లమైంది.
రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం!
అవినీతి రహితంగా, వివాదాలకు తావివ్వకుండా రెవెన్యూ సేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పట్టాదార్ పుస్తకం జారీ అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుత విధానం వల్ల అవినీతి, వివాదాలకు ఆజ్యం పోస్తుందని భావించిన సర్కారు.. నోటీసులు, విచారణలు, రికార్డుల అప్‌డేషన్, ఆన్‌లైన్ పేరిట కాలయాపన చేయకుండా అదే రోజు పాస్‌పుస్తకం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అధికారాల బదలాయింపు, వికేంద్రీకరణతో ఇరుశాఖలు ఏకీకృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి మండలంలో తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్ ఒకరే ఉండనున్నారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలపై ఇరు శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలావుండగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు, వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ చేస్తారనే మరో ప్రచారం కూడా ఉంది.
వీఆర్వో ఎందుకొద్దంటే..
గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్‌ఏల వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపై కసరత్తు చేసింది. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారాల్లో సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పహాణీలో కాస్తు కాలమ్ ఎత్తివేసిందున.. కాస్తు కాలమ్‌ను గ్రామస్థాయిలో నమోదు చేసే వీఆర్వో వ్యవస్థ అవసరంలేదనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీంట్లో భాగంగా 1985, 1991ల్లో తీసుకువచ్చిన చట్ట సవరణలకు కొనసాగింపుగా వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దు చేయాలని నిర్ణయించింది. మరోవైపు వీఆర్వోలు, వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లను పురపాలక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో విలీనం చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, వీఆర్‌ఏలలో కొందరిని మాత్రం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. తహసీల్దార్‌తో లింకు తెగిపోకుండా కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వీఆర్వో వ్యవస్థ రద్దు
Published Tue, Sep 8 2020 1:16 AM | Last Updated on Tue, Sep 8 2020 1:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment