రెవెన్యూ శాఖకు జవసత్వాలు తేవాలి | No use to solve Revenue employees problems | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖకు జవసత్వాలు తేవాలి

Published Sun, Feb 1 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

No use to solve Revenue employees problems

తెలంగాణ రాష్ర్టంలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న తహసీల్దార్ స్థాయి నుంచి ఆఫీసు సబార్డినేట్ వరకున్న రెవెన్యూ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత ప్రభుత్వాలతో పలు మార్లు చర్యలు జరిపినా ఫలితం శూన్యమే. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) మొదలు తహసీల్దార్ స్థాయి వరకు మొత్తం సిబ్బంది సంఖ్య 48 వేలు ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం రాత్రింబవళ్లు శ్రమించాల్సింది కూడా ఈ రెవెన్యూ ఉద్యోగులే. పలు సందర్భాల్లో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, వీఆర్‌ఓలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సివస్తోంది.
 
 రాత్రిబవళ్లూ సేవలే: పోలీస్ శాఖ తర్వాత 24 గంటలు పనిచేసే విభాగం రెవెన్యూ శాఖనే పనివేళలు అసలేలేవు. సాయంత్రం వేళ పనిముగించుకొని ఇంటికి వెళ దామంటే మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు రాత్రి వరకు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత కిందిస్థాయి అధికారుల సూచనలు షరా మామూలే! పైగా ప్రతి జిల్లాలోని కలె క్టరేట్‌లో ఏ నుంచి జె వరకు సెక్షన్‌లు ఉంటాయి. వీటికి పరిపాలనా ధికారులుగా తహశీల్దార్ స్థాయిలో పది మంది ఉండాలి కానీ ఏ జిల్లాలోను ముగ్గురికి నలుగురికి మించిలేరు. మండలాల్లో కూడా కొన్ని చోట్ల తహసీల్దార్లు లేక డిప్యూటీ తహశీల్దార్‌లు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్‌లు, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిపై రెట్టింపు భారం పడుతోంది. శ్రమకు తగ్గ వేతనాలు రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు లేవు. విద్యాశాఖలోని హెడ్‌మాస్టర్లకు ఉన్న స్కేలు తహశీల్దార్‌లకు లేదు. ఉపాధ్యాయులకు ఉన్న స్కేళ్లు రెవెన్యూ ఉద్యోగులకు లేవు. పే స్కేలు రెట్టింపు చేయాలని, స్పెషల్ స్కేల్ ఇవ్వాలని వేతన సవరణ సంఘాలకు గత ప్రభుత్వాలకు రెవెన్యూ కేంద్ర సంఘం అధ్యక్షుడు శివశంకర్ ఆధ్వర్యంలో ఉద్యమించినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వ భూముల పరి రక్షణలో, ఇసుక అక్రమ రవాణా అరికట్టే విషయంలో వాల్టా చట్టం అమలులో తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్‌ఓ లపై తరచు దాడులు జరుగుతూనే ఉన్నాయి.
 
 కరీంనగర్ జిల్లా లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ఓ మహిళ తహశీల్దార్‌పై హత్యా ప్రయత్నం, ఆదిలాబాద్ జిల్లా భీమిని మండల తహశీల్దా ర్‌పై సర్పంచ్ దాడి చేయడం ఇందుకు ఉదాహరణలు. పలు జిల్లాల్లో నిక్కచ్చిగా వ్యవహరించే రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేయించడం, తమ అనుచరులచే ఎస్సీ, ఎస్టీ, ఏసీబీ తదితర కేసుల్లో ఇరికించడం వంటి బాధలు పెడుతున్నారు. ఈ బాధల నుంచి రెవెన్యూ శాఖ ఉద్యోగుల రక్షణకు ప్రభుత్వపరంగా తగు చర్యలు చేపట్టి ఆ శాఖకు జవసత్వాలు తేవాలి.
 - హరి అశోక్ కుమార్  హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement