ప్రభుత్వ ఉద్యోగాలున్నయ్‌.. కానీ జీతాల్లేవ్‌! | Concern for salaries of revenue staff in new mandals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగాలున్నయ్‌.. కానీ జీతాల్లేవ్‌!

Published Sun, Apr 30 2023 2:35 AM | Last Updated on Sun, Apr 30 2023 10:33 AM

Concern for salaries of revenue staff in new mandals - Sakshi

కోరుట్ల: పేరుకి ప్రభుత్వోద్యోగమే అయినా ఆర్నెల్లుగా నయాపైసా జీతం లేక అల్లాడిపోతున్నారు కొత్త మండలాల్లోని రెవిన్యూ ఉద్యోగులు. గతేడాది సెప్టెంబర్‌ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 97 జారీచేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా తొలుత తహసీల్దార్‌ కార్యాలయాలకు రూపునిచ్చారు. ఆయా జిల్లాల్లోని వివిధ మండలాల్లో పనిచేసే సిబ్బందికి వాటిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉందికానీ.. కొత్త మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల మంజూరు కోసం సీసీఎల్‌ఏ నుంచి ’క్యాడర్‌ స్ట్రెంత్‌’సర్కులర్‌ జారీచేయాల్సి ఉంటుంది. ఈ జీవో జారీ ఆరు నెలలుగా జాప్యమవుతోంది. దీంతో సిబ్బందికి వేతనాలు అందడంలేదు. 

13 మండలాలు.. 240 మంది సిబ్బంది.. 
   కొత్త మండలాల జీవో జారీ కాగానే తహసీల్దార్‌ కార్యాయాలు ఏర్పాటు చేశారు.  
 నిబంధనల ప్రకారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు గిర్దావర్లు(ఆర్‌ఐలు), ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఒక జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, అటెండర్, చైన్‌మన్‌తోపాటు గ్రామాల సంఖ్యను బట్టి 15–25 మంది వీఆర్‌ఏలను నియమించారు. 
 జీవో 97 ప్రకారం ఇతర మండలాల్లోని సిబ్బందిని కొత్త మండలాల్లో నియమిస్తూ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు.  
♦ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 13 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సుమారు 240 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు.  

ఆర్నెల్లుగా అరిగోస.. 
విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు జీతాలు రాకపోవడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్‌ స్ట్రెంత్‌ జీవో జారీకోసం కొందరు జిల్లా కలెక్టర్లు సీసీఎల్‌ఏకు మొరపెడుతూ లేఖలు రాసినా పట్టించుకునే వారులేరు. జీవో జారీ కాకపోవడంతో ఉద్యోగుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, వేతనాల విడుదల వంటి అంశాల వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు కాలేదు. ఫలితంగా ఆరు నెలలుగా జీతాలు లేక కొత్త మండలాల్లో పనిచేస్తున్న సుమారు 240 మంది రెవెన్యూ ఉద్యోగులు నానాతిప్పలు పడుతున్నారు.

ఏమిటీ క్యాడర్‌ స్ట్రెంత్‌? 
కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాల్లో హోదాల ప్రకారం ఉండాల్సిన సిబ్బంది, వేతన వివరాలు, ఆర్థికపరమైన అనుమతులను రెవెన్యూ పరిభాషలో క్యాడర్‌ స్ట్రెంత్‌ అంటారు. ఈ క్యాడర్‌ స్ట్రెంత్‌ జీవో విడుదల అయితేనే కొత్త మండలాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వేతనాలు నేరుగా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ జీవోను సీసీఎల్‌ఏ జారీ చేయాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement