కోటబొమ్మాళి: సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించింది. స్థానికంగా లేని కుటుంబాలను గుర్తించి వారి కార్డులు తొలగించడం.. చనిపోయిన వ్యక్తులు, వివాహమై అత్తవారింటికి వెళ్లిన అమ్మాయిల వివరాలు సేకరించి వారి పేర్లను ఆయా కుటుంబాల రేషన్ కార్డుల్లో తొలగించడం ఈ సర్వే లక్ష్యం. ఆ మేరకు కోటబొమ్మాళి మండలంలో వీఆర్వోలు, రేషన్ డీలర్ల సహకారంతో పౌరసరఫరా శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. మండలంలో 38 పంచాయతీలు ఉండగా.. వాటి పరిధిలో 477 రేషన్ కార్డులను మార్పులు, తొలగింపుల కోసం గుర్తించారు. వీటిలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, చనిపోయిన వ్యక్తుల పేర్లు మాత్రమే తొలగించవలసిన కార్డులు 129 ఉండగా, మిగిలినవి ఆధార్ వివరాలు లేకపోవడం, అడ్రస్ మారడం, కుటుంబాలు వలసపోవడం వంటి కారణాల వల్ల పూర్తిగా తొలగించాల్సిన కార్డులే. ఈ వర్గీకరణ ప్రకారం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే అధికారుల నిర్లక్ష్యం కారణంగా మొత్తం 477 రేషన్ కార్డులు పౌర సరఫరా శాఖ జాబితా నుంచి తొలగిపోయాయి(డిలీట్ అయ్యాయి). కీ రిజిస్టర్‌లో తమ కార్డుల వివరాలు గల్లంతైన విషయం ఆలస్యంగా తెలుసుకున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల పేర్లలో ఒకటో రెండో తొలగిపోతాయనుకుంటే ఏకంగా కార్డులే లేకుండాపోయాయని ఆందోళన చెందుతున్నారు. చిన్నసానలో 21, కోటబొమ్మాళిలో45, యలమంచిలిలో 10, కన్నేవలసలో 12, కొత్తపల్లిలో 15, కురుడులో 13, గ ంగరాంలో 14, పాకివలసలో 9 కార్డులు అధికారుల తప్పిదం కారణంగా రద్దుకావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. తమ పరిస్థితేమిటని అధికారులను అడిగితే.. ఏదో జరిగిపోయింది.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కార్డులు ఇస్తామని, ఉన్నతాధికారులకు చెబుతామని అంటున్నారు. అయితే మళ్లీ కార్డులు రావడానికి ఎన్నాళ్లు పడుతుందో.. అప్పటివరకు తాము రేషన్ కోల్పోవలసిందేనా? అని బాధితులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. మిగిలిన కార్డుల రద్దు విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఈ 129 కార్డులు పోగా మిగిలిన కార్డులు చాలా వరకు కొత్తగా మంజూరైనవే. వీటిలో కుటుంబ వివరాలు, ఆధార్ నెంబర్లు, ఫొటోలు వంటివి లేని విషయాన్ని గుర్తించి.. వాటిని సేకరించి, నమోదు చేయించాల్సిన బాధ్యతను సంబంధిత రేషన్ డీలర్లకు అప్పగించారు. అయితే వారు సరిగ్గా స్పందించకపోవడంతో అవి కూడా రద్దయిపోయాయి. ఫలితంగా మండలంలో 477 కార్డులకు గత కొన్ని నెలలుగా రేషన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుటూ ్టతిరుగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రద్దయిన తమ కార్డుల విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
సీఎస్‌డీటీ వివరణ
దీనిపై సీఎస్‌డీటీ చంద్రశేఖర్ ఆచారిని వివరణ కోరగా నిబంధనల ప్రకారం పెళ్లయ్యి వెళ్లిపోయిన అమ్మాయిలు, చనిపోయిన వ్యక్తుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించేందుకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ పెట్టామన్నారు. అయితే సాంకేతిక లోపంతో 129 కార్డులు రద్దయ్యాయని అంగీకరించారు. వాటి పునరుద్ధరణ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామన్నారు.
తహశీల్దార్ వివరణ
తహ శీల్దార్ వై.శ్రీనివాసరావు స్పందిస్తూ తాను ఎన్నికల అనంతరం ఇక్కడ బాధ్యతలు చేపట్టానని, అంతక ముందు ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. అయితే రేషన్ కార్డుల రద్దయ్యాయని చాలామంది తనకు పిర్యాదు చేశారని వెల్లడించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించానని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.
పేర్లు తొలగించమంటే.. కార్డులే లేపేశారు!
Published Wed, Sep 10 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement