- ఇన్‌చార్జి జేసీ నాగేంద్రకు సమ్మె నోటీసు
- సెప్టెంబర్1 నుంచి విధుల బహిష్కరణ
వీఆర్‌ఏల పోరుబాట
Published Thu, Aug 25 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
ముకరంపుర : మరోసారి వీఆర్‌ఏలు సమ్మెకు సిద్ధమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందంటూ ఆందోళనకు దిగుతున్నారు. సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్1 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్‌ఏల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవు ఆధ్వర్యంలో ఇన్‌చార్జి జేసీ నాగేంద్రకు గురువారం సమ్మె నోటీసు అందజేసారు.
ఏపీపీఎస్‌సీ ద్వారా నియామకమైన గ్రామ రెవెన్యూ సహాయకులు 56 రకాల విధులతో వెట్టిచాకిరీ చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అంగన్‌వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు జీతాలు పెంచినప్పటికీ వీఆర్‌ఏల సమస్యలపై స్పందించడం లేదంటూ వాపోతున్నారు. వీఆర్‌ఏలను పార్ట్‌టైం ఉద్యోగులుగానే పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినా జిల్లాలో అమలు కావడం లేదు. 2012, 2014 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మందికి గాను జిల్లాలో 700 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా అప్పటి ప్రభుత్వం వీఆర్‌ఏలను భర్తీ చేసింది. వీరికి గౌరవ వేతనంగా రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా కావడంతో ఎక్కువగా ఉన్నత విద్యావంతులే వీఆర్‌ఏలుగా నియామకమయ్యారు. ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ అయినప్పటికీ వీఆర్‌ఏలకు సర్వీసు రూల్స్ వర్తించడం లేదు.
పని బారెడు...
గ్రామాలు, పట్టణాల్లో మొత్తం 56 రకాల విధులను నిర్వర్తిస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో పహాణీలు, కుల, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాలు, పాస్‌బుక్‌ల కంప్యూటరీకరణ పనులను వీఆర్‌ఏ చేస్తున్నారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్‌లకు కావాల్సిన రికార్డులను వీరే అందిస్తారు. సమగ్ర సర్వే, హరితహారం, ఆహార భద్రత కార్డుల తయారీ సమాచారాన్ని గ్రామస్థాయిలో పూర్తిగా అందించేది కూడా వీరే. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల శిఖాలు కాపాడడానికి వీరు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
వీఆర్‌ఏల డిమాండ్‌లు..
–సర్వీసును రెగ్యులరైజ్ చేస్తూ పే స్కేలు అమలు చేయాలి
–పదోన్నతుల్లో ఇచ్చే వాటా 30 నుంచి 70 శాతానికి పెంచాలి
–మూడేళ్లు పూర్తయిన వారికి వీఆర్‌వోలుగా పదోన్నతి కల్పించాలి
–హెల్త్‌కార్డులు మంజూరీ చేయాలి.
–మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలి.
–నూతనంగా ఏర్పడే జిల్లాల్లో రెవెన్యూ శాఖలోని ఖాళీలను అర్హత కలిగిన ఏపీపీఎస్‌సీ ద్వారా ఎంపికైన వారితో భర్తీ చేయాలి.
Advertisement
Advertisement