వీఆర్‌ఏల వేతనం పెంపు | Telangana: CM KCR announces salary hike for VRA's | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల వేతనం పెంపు

Published Sat, Feb 25 2017 4:07 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

వీఆర్‌ఏల వేతనం పెంపు - Sakshi

వీఆర్‌ఏల వేతనం పెంపు

- రూ.10,500కు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం
- ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి
- స్వగ్రామాల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు
- రెగ్యులర్‌ నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్‌
- రాష్ట్రంలోని 19,345 మంది వీఆర్‌ఏలకు ప్రయోజనం


సాక్షి, హైదరాబాద్‌:
వారసత్వంగా పనిచేస్తున్న విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్‌ఏ)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలు కురిపించారు. వీఆర్‌ఏల వేతనాలను 64.61 శాతం పెంచనున్నట్లు సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రకటించారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ.6,500గా ఉన్న వీఆర్‌ఏల వేతనం రూ.10,500కు పెరగనుంది. అదనంగా రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్‌ను కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కో వీఆర్‌ఏ వేతనం రూ.4,200 చొప్పున పెరుగుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయి.

గ్రామాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నందున ప్రతీ వారసత్వ వీఆర్‌ఏకు డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తమ స్వగ్రామంలో ఇల్లు కట్టివ్వాలని, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీఆర్‌వో, అటెండర్, డ్రైవర్‌ తదితర ఉద్యోగాల నియామకాల్లో 30 శాతం ఉద్యోగాలు వీరికి రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. వెట్టి తదితర పేర్లతో పిలుస్తున్న వారందరినీ ఇకపై గౌరవంగా వీఆర్‌ఏలు అని సంబోధించాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో వారసత్వంగా పనిచేస్తున్న 19,345 మంది వీఆర్‌ఏలకు ప్రయోజనం చేకూరుతుంది. వీఆర్‌ఏ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వీఆర్‌ఏ(డైరెక్ట్‌ రిక్రూటీస్‌) సంఘం అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు బాలామణి, వీఆర్‌ఏ(డిపెండెంట్స్‌) సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లన్న, రాజయ్య, కార్మిక సంఘం నాయకులు జి.రాంబాబుయాదవ్, పి.నారాయణ తదితరులు సీఎంతో చర్చలు జరిపారు.

ఒకటో తారీఖున వేతనం..
‘ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి వీఆర్‌ఏలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జీతాలను పెంచుతాం. ప్రతి నెలా ఒకటో తారీఖున మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికీ వేతనం అందాలి. వీఆర్‌ఏలకు గౌరవం కూడా పెరగాలి. వెట్టి, మస్కూరి, కావల్‌ కార్, కాన్‌ దార్‌ తదితర పేర్లతో వీరిని పిలుస్తున్నారు. ఇకపై అలా పిలవవద్దు. ఏ పని చేసే వారైనా సరే వీఆర్‌ఏ అని మాత్రమే పిలవాలి. పెరిగిన జీతం, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, పిలిచే పిలుపుతో వీఆర్‌ఏల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం..’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

డైరెక్ట్‌ రిక్రూటీల రెగ్యులరైజ్‌..
పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్ష రాసి వీఆర్‌ఏలుగా పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ‘కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా పోస్టులు అవసరమవుతాయి. ఇంకా ప్రభుత్వంలో ఖాళీలను కూడా గుర్తించాలి. వీరందరినీ రెగ్యులర్‌ చేయాలి’అని సీఎం అన్నారు. వెంటనే విధివిధానాలు తయారు చేయాలని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ.. తక్కువ వేతనంతో పని చేస్తున్న 2,900 మంది డెరెక్ట్‌ రిక్రూట్‌ వీఆర్‌ఏలకు లబ్ధి చేకూరుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement