
సాక్షి, హైదరాబాద్: గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరిస్తామని, 55 ఏళ్లు నిండిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగం కల్పిస్తామని, వీఆర్‌ఏల సొంత గ్రామాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని 2017లో మహా శివరాత్రి పండుగ రోజు ప్రగతిభవన్, మంత్రులు, ఉన్నతాధికారుల సాక్షిగా సీఎం హామీ ఇచ్చి ఐదేళ్లవుతున్నా నెరవేర్చలేదని విమర్శించారు.
మరోవైపు 2020లో అసెంబ్లీలో రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతూ వీఆర్‌ఏలందరికీ పే స్కేల్ కల్పించి క్రమబద్ధీకరిస్తానని చెప్పి 22 నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామని.. వీఆర్‌ఏలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని పొన్నం గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment