సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)ను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకునే ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఈ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్‌ఏల విలీన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు ప్రకటన నుంచి కేటాయింపు వరకు కలెక్టర్లే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది.
61 ఏళ్లు నిండితే కారుణ్య ఉద్యోగం
61 ఏళ్లు దాటిన వీఆర్‌ఏల కుమారుడు లేదా కుమార్తెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. కారుణ్య ఉద్యోగం కోసం ఈ ఏడాది జూలై 31 నాటికి వీఆర్‌ఏ వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు ఫార్మాట్‌ను రూపొందించారు. దీని ప్రకారం దరఖాస్తు చేసుకోవడంతో పాటు సదరు వీఆర్‌ఏ కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కుటుంబసభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమరి్పంచాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, విద్యార్హత, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ వివరాలను జత పరచాల్సి ఉంటుంది. ఈ కారుణ్య నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
వీఆర్‌ఏల విలీనం మార్గదర్శకాలివే..
- తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్‌లోని రూల్ 10(ఏ) ప్రకారం వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకుంటారు. ఇదే నియమం ప్రకారం కారుణ్య నియామకాలు కూడా చేపడతారు.
- విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ శాఖల్లోని చివరి స్థాయి సర్విసు/రికార్డు అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్ తత్సమాన హోదాల్లో వీఆర్‌ఏలను రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటారు.
- జిల్లాల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆయా హోదాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఆ జిల్లాలో విలీనం చేసుకోవాల్సిన వీఆర్‌ఏల సంఖ్యను కలెక్టర్లు ప్రకటించాలి.వాటి ఆధారంగా వీఆర్‌ఏల విలీనం, కారుణ్య నియామకాల కోసం అవసరమైతే రెగ్యులర్ లేదా సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మించి వీఆర్‌ఏలను విలీనం చేసుకోవాల్సి వస్తే వారిని ఇతర జిల్లాలకు కూడా పంపవచ్చు. అలా పంపాల్సి వస్తే సదరు వీఆర్‌ఏల వివరాలను ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తర్వాత సదరు వీఆర్‌ఏలు తమకు కేటాయించిన జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లా కలెక్టర్ వీఆర్‌ఏను ఏదైనా శాఖలో విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేస్తారు.
- అదే జిల్లాలో సర్దుబాటు చేసినా, ఇతర జిల్లాలకు పంపినా కలెక్టర్ కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తహసీల్దార్లు వీఆర్‌ఏలను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు పంపితే ఆయా శాఖల సర్వీసు రూల్స్ వీఆర్‌ఏలకు వర్తిస్తాయి.
- ఒక్కసారి కేటాయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదు. తమను మార్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉండదు.
- కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీఆర్‌ఏలు సంబంధిత అధికారికి రిపోర్టు చేయాలి. ఆ అధికారి బేషరతుగా వారిని విధుల్లోకి తీసుకుని పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.
తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయండి
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మల్టిజోన్లలోని ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎల్‌ఏ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే తహసీల్దార్లను విధుల్లోకి తీసుకోవాలని, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్లు కూడా పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 మందికి పైగా తహసీల్దార్లు గత నెల 31న బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇలావుండగా తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన మరో 9 మందికి మంగళవారం పోస్టింగులిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment