అమ్రాబాద్ అభయారణ్యంలోని నీటిపాయల్లో కొత్త రకం చేప గుర్తింపు
కల్సుబాయి, రాధానగరి వైల్డ్ లైఫ్ రిజర్వ్‌లలో మరో రెండు చేపల రకాలు కూడా..
తాజాగా గుర్తించిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
సాక్షి, హైదరాబాద్: ఏడు చేపల కథ తెలుసుగానీ ఈ మూడు చేపల కథ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? ముందుగా రాష్ట్రంలోని అమ్రాబాద్‌తోపాటు కల్సుబాయి, రాధానగరి పేర్లు విన్నారా? అవి దేశంలోని ప్రముఖ అభయారణ్యాలు. ఈ అభయారణ్యాల్లోని నీటిపాయల్లో తాజాగా మూడు రకాల చేపల జాతులను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) గుర్తించింది. ఈ చేపల రకాలు ఇండోరియోనెక్టెస్ జాతికి చెందినప్పటికీ కాస్త వేర్వేరు లక్షణాలు కలిగి ఉండటంతో వాటికి మూడు వేర్వేరు పేర్లు పెట్టారు. అందులో మొదటి రకం చేపను తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో గుర్తించారు.
అందుకే దానికి ఇండోరియెనెక్టెస్ ఆమ్రాబాద్ అని పేరు పెట్టారు. ఇది అక్కడ మాత్రమే జీవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక రెండో రకం చేప జాతిని మహారాష్ట్రలోని పశి్చమ కనుమలలో ఉన్న కల్సుబాయి అభయారణ్యంలో గుర్తించిన సైంటిస్టులు.. దానికి ఇండోరియెనెక్టెస్ కల్సుబాయిగా నామకరణం చేశారు. మూడో రకం చేప జాతిని మహారాష్ట్రలోని రాధానగరి అభయారణ్యంలోని ఓ నదీ ప్రవాహంలో గుర్తించారు. దీనికి ఇండోరియోనెక్టెస్ రాధానగరిగా పేరుపెట్టారు.
ఇండోరియోనెక్టెస్ వర్గానికి చెందిన చేపలు చాలా వరకు గోదావరి, కృష్ణా, కావేరి నదీ వ్యవస్థల్లో ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్త శ్రీకాంత్ జాదవ్ వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళలలో ఇవి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా 2020లో ఇదే వర్గానికి చెందిన ఇండోరియోనెక్టెస్ తెలంగాణెన్సిస్‌ను కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ రకానికి చెందిన ఆరు జాతుల చేపలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment