కోట్ల ఏళ్ల క్రితం ఎన్నో అరుదైన జీవజాతులు తెలంగాణ ప్రాంతంలో తమ అస్తిత్వాన్ని చాటుకున్నా యి. ఇక్కడ వెలుగు చూస్తున్న అప్పటి జీవ, వృక్ష జాతుల శిలాజాలు (ఫాసిల్స్) ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఆర్కియాలజీ (పురావస్తు పరిశోధన), పేలియంటాలజీ (శిలాజాల పరిశోధన) విభాగాల పరిశోధనల్లో ఇవి బహిర్గతమవుతున్నాయి. జురాసిక్ యుగం కన్నా ముందు యుగమైన ట్రయాసిక్ యుగం నాటి శిలాజాలు కూడా తెలంగాణలో దొరుకుతుండటం గమనార్హం. అనేక అరుదైన శిలాజాలను తెలంగాణ తన గర్భంలో దాచుకుందని, అనేక కొత్త అధ్యాయాలకు తెరతీసే అంతటి చరిత్ర ఇక్కడ దాగి ఉందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్
వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస
శిలాజాలపై 200 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. గత చరిత్రకు, ప్రస్తుత తరానికి మధ్య జీవపరిణామ అంశాలను, జీవ వైవిధ్యాన్ని, జీవన స్థితిగతులును తెలియజేసేవే శిలాజాలు. సాధారణంగా ప్రిజర్వ్ (బురద, బంక, మంచులో కూరుకుపోయి ఏర్పడిన శిలాజాలు), ట్రేస్, కార్బన్, మోల్డ్స్, టెట్రిఫైడ్ అనే ఐదు రకాల శిలాజాలు ఉంటాయి. దాదాపుగా ఈ ఐదు రకాల శిలాజాలూ తెలంగాణలో లభ్యమయ్యాయి.
ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారంలో రింకోసారా జాతికి చెందిన 25 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) 2000 సంవత్సరంలో వెలికితీసింది. పెద్దపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా శిలాజ సంపద ఎక్కువగా ఉంది. మంచిర్యాలలోని వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస (శిలాజం) బయటపడింది. చెన్నూరు అడవుల్లో ఆకుల శిలాజాలను, ఆసిఫాబాద్ జిల్లాలో షెల్ ఫాసిల్స్‌ను, మరోచోట పిల్లి జాతి (పిల్లి, పులి, చిరుత...)కి చెందిన పాద ముద్రల శిలాజాలను పరిశోధకులు గుర్తించారు.
మంచిర్యాలలోని జైపూర్‌లో ఓ క్షీరదానికి సంబంధించిన శిలాజం వెలుగు చూసింది. వేమనపల్లి పరిసర ప్రాంతాల్లో జురాసిక్ యుగం నాటి పాదముద్రలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో మైక్రో (సూక్ష్మ) ఫాసిల్స్ విరివిగా ఉన్నాయి. వోల్కనిక్ ఎరా (అగ్ని పర్వతాల నుంచి లావా వెలువడి అధిక శాతం జీవజాలం నశించిన సమయం) కు సంబంధించిన ఆరున్నర కోట్ల ఏళ్లనాటి శిలాజాలు దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా బయటపడుతున్నాయి.
శిలాజాల కోసం తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్రలో ప్రత్యేకంగా పార్కులు నిర్మించి భద్రపరుస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే అరుదైన సంపదను సంరక్షించవచ్చని, వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలవుతుందని పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు.
ఫాసిల్ పార్కు ఏర్పాటు చేయాలి..
మన వద్ద 50 కోట్ల ఏళ్ల నాటి శిలాజ సంపద కూడా ఉంది. అయితే వీటి పరిరక్షణ, ఇతర పరిశోధనల విషయంలో అవసరమైనంత మేర కృషి జరగడం లేదు. ఈ మధ్య కాలంలో పలువురు యువ ఔత్సాహికులు శిలాజాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా ఫాసిల్ పార్కుల దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – చక్కిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, జీఎస్‌ఐ
2012 నుంచి పరిశోధనలు..
తెలంగాణలో అనేక అరుదైన శిలాజాలు ఉన్నా యి. నేను 2012లో వీటిపై వ్యక్తిగతంగా పరిశోధనలు ప్రారంభించా. ప్రొఫెసర్లు, ఇతర పరిశోధకుల సహకారంతో నైపుణ్యం సాధించా. ఇప్పటివరకు ఆదిమానవుడి రాతి పనిముట్లు, కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ల అవయవాలకు సంబంధించిన శిలాజాలు సేకరించా. నా పరిశోధనల సంబంధిత సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టలోని వర్సిటీల విద్యార్థులకు సెమినార్లు, ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నా. – సునీల్ సముద్రాల, ఔత్సాహిక పరిశోధకుడు, బేగంపేట, పెద్దపల్లి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment