dinosaur fossil
-
ఈ చేప వయసు 18కోట్ల ఏళ్లు!
కోట్ల ఏళ్ల క్రితం ఎన్నో అరుదైన జీవజాతులు తెలంగాణ ప్రాంతంలో తమ అస్తిత్వాన్ని చాటుకున్నా యి. ఇక్కడ వెలుగు చూస్తున్న అప్పటి జీవ, వృక్ష జాతుల శిలాజాలు (ఫాసిల్స్) ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఆర్కియాలజీ (పురావస్తు పరిశోధన), పేలియంటాలజీ (శిలాజాల పరిశోధన) విభాగాల పరిశోధనల్లో ఇవి బహిర్గతమవుతున్నాయి. జురాసిక్ యుగం కన్నా ముందు యుగమైన ట్రయాసిక్ యుగం నాటి శిలాజాలు కూడా తెలంగాణలో దొరుకుతుండటం గమనార్హం. అనేక అరుదైన శిలాజాలను తెలంగాణ తన గర్భంలో దాచుకుందని, అనేక కొత్త అధ్యాయాలకు తెరతీసే అంతటి చరిత్ర ఇక్కడ దాగి ఉందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస శిలాజాలపై 200 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. గత చరిత్రకు, ప్రస్తుత తరానికి మధ్య జీవపరిణామ అంశాలను, జీవ వైవిధ్యాన్ని, జీవన స్థితిగతులును తెలియజేసేవే శిలాజాలు. సాధారణంగా ప్రిజర్వ్ (బురద, బంక, మంచులో కూరుకుపోయి ఏర్పడిన శిలాజాలు), ట్రేస్, కార్బన్, మోల్డ్స్, టెట్రిఫైడ్ అనే ఐదు రకాల శిలాజాలు ఉంటాయి. దాదాపుగా ఈ ఐదు రకాల శిలాజాలూ తెలంగాణలో లభ్యమయ్యాయి. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారంలో రింకోసారా జాతికి చెందిన 25 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2000 సంవత్సరంలో వెలికితీసింది. పెద్దపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా శిలాజ సంపద ఎక్కువగా ఉంది. మంచిర్యాలలోని వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస (శిలాజం) బయటపడింది. చెన్నూరు అడవుల్లో ఆకుల శిలాజాలను, ఆసిఫాబాద్ జిల్లాలో షెల్ ఫాసిల్స్‌ను, మరోచోట పిల్లి జాతి (పిల్లి, పులి, చిరుత...)కి చెందిన పాద ముద్రల శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. మంచిర్యాలలోని జైపూర్‌లో ఓ క్షీరదానికి సంబంధించిన శిలాజం వెలుగు చూసింది. వేమనపల్లి పరిసర ప్రాంతాల్లో జురాసిక్ యుగం నాటి పాదముద్రలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో మైక్రో (సూక్ష్మ) ఫాసిల్స్ విరివిగా ఉన్నాయి. వోల్కనిక్ ఎరా (అగ్ని పర్వతాల నుంచి లావా వెలువడి అధిక శాతం జీవజాలం నశించిన సమయం) కు సంబంధించిన ఆరున్నర కోట్ల ఏళ్లనాటి శిలాజాలు దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా బయటపడుతున్నాయి. శిలాజాల కోసం తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్రలో ప్రత్యేకంగా పార్కులు నిర్మించి భద్రపరుస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే అరుదైన సంపదను సంరక్షించవచ్చని, వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలవుతుందని పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు. ఫాసిల్ పార్కు ఏర్పాటు చేయాలి.. మన వద్ద 50 కోట్ల ఏళ్ల నాటి శిలాజ సంపద కూడా ఉంది. అయితే వీటి పరిరక్షణ, ఇతర పరిశోధనల విషయంలో అవసరమైనంత మేర కృషి జరగడం లేదు. ఈ మధ్య కాలంలో పలువురు యువ ఔత్సాహికులు శిలాజాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా ఫాసిల్ పార్కుల దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – చక్కిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, జీఎస్ఐ 2012 నుంచి పరిశోధనలు.. తెలంగాణలో అనేక అరుదైన శిలాజాలు ఉన్నా యి. నేను 2012లో వీటిపై వ్యక్తిగతంగా పరిశోధనలు ప్రారంభించా. ప్రొఫెసర్లు, ఇతర పరిశోధకుల సహకారంతో నైపుణ్యం సాధించా. ఇప్పటివరకు ఆదిమానవుడి రాతి పనిముట్లు, కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ల అవయవాలకు సంబంధించిన శిలాజాలు సేకరించా. నా పరిశోధనల సంబంధిత సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టలోని వర్సిటీల విద్యార్థులకు సెమినార్లు, ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నా. – సునీల్ సముద్రాల, ఔత్సాహిక పరిశోధకుడు, బేగంపేట, పెద్దపల్లి జిల్లా -
ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి
కాల్సైట్ స్పటికాల సముహాలతో నిండి... ఫిరింగి పరిమాణంలో ఉన్న డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి చైనాలో అన్హుయ్ ప్రావిన్స్‌లోని కియాన్షాన్లో గుర్తించారు. ఇవి రెండు దాదాపు సంపూర్ణ గుండ్రని గుడ్లని, క్రెటేషియస్ కాలం నాటివిగా పేర్కొన్నారు. అంతేగాదు ఇవి డైనోసార్ల యుగంలో చివరి కాలంనాటివిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లలోనే ఇవి ఒక కొత్త జాతిగా భావిస్తున్నారు. ఎందుకంటే గుడ్ల పరిమాణం, షెల్ యూనిట్, గట్టి అమరిక, ప్రత్యేకమైన గోళాకార ఆకృతి తదితరాలను బట్టి పాలియోంటాలజిస్టులు డైనోసార్లలో కొత్త జాతికి చెందినవిగా పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ గుడ్లలో ఒకటి సరిగా సంరక్షించబడలేదని చెప్పారు. అందువల్లే వాటి అంతర్గత సముహాల్లో కాల్సైట్ స్పటికాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇవి దాదాపు గోళాకారంగా ఉండి, పొడవు 4.1 అంగుళాలు నుంచి 5.3 అంగుళాల మధ్య, వెడల్పు 3.8 అంగుళాల నుంచి 5.2 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ డైనోసార్లు చిన్నచిన్న మొక్కలను ఆహారంగా తినే బైపెడల్ డైనోసార్లగా శాస్తవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్ దృశ్యాలు వైరల్) -
ములుగు జిల్లా అటవీప్రాంతంలో డైనోసార్ల చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపురాతన వృక్ష శిలాజాలతో కూడిన ప్రాంతం వెలుగుచూసింది. కోట్ల సంవత్సరాల క్రితం అలరారిన వృక్షాలు కాలక్రమంలో శిలాజాలుగా మారి భూమి పైపొరల్లో రాళ్లలా నిక్షిప్తమైపోయాయి. గతంలో ఇలాంటి శిలాజాలు కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూసినా.. ఇప్పుడు కొత్తగా బయటపడ్డ ప్రాంతంలో దాదాపు 40 అడుగుల పొడవు వరకు ఉన్న వృక్ష శిలాజాలు కనిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ములుగు జిల్లా కన్నాయెగూడెం మండలంలోని భూపతిపూర్‌కు నాలుగు కి.మీ. దూరంలోని దట్టమైన అటవీప్రాంతంలో ఇవి ఉన్నాయి. దాదాపు ఐదు కి.మీ. పరిధిలో ఈ శిలాజాలు కనిపిస్తుండటంతో, దేశంలో మరో విశాలమైన శిలాజవనం (ఫాజిల్ పార్కు) ఏర్పాటుకు అనువైన ప్రాంతం వెలుగుచూసినట్టయింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నజీర్, మహేశ్ తదితరులు స్థానిక కేసం రవితో కలిసి పరిశీలించి వీటిని గుర్తించారు. అలనాటి భారీ వృక్షాలే.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాక్షసబల్లులు (డైనోసార్లు) తిరిగిన జాడలున్నాయి. పూర్వపు ఆదిలాబాద్ బెజ్జూరు మండలం కొండపల్లి ప్రాంతం, ఖమ్మం జిల్లాలోని కిష్టారం ఓపెన్ కాస్ట్ ఏరియా దగ్గరి చెరుకుపల్లి అటవీ ప్రాంతం, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం, మంచిర్యాల సమీపంలోని భీమారం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీప్రాంతం, పాల్వంచ నల్లముడి గ్రామ సమీపంలో వృక్ష శిలాజాలు గతంలో కనిపించాయి. తాజాగా వెలుగుచూసిన ప్రాంతం వాటికంటే విశాలమైంది కావటంతోపాటు పొడవాటి వృక్షాల శిలాజాలు పెద్దగా చెదిరిపోకుండా కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో డైనోసార్ల శిలాజాలు కూడా కనిపించాయి. ఇక్కడి డైనోసార్ శిలాజాలు బిర్లా సైన్స్ మ్యూజియం, కోల్‌కతా మ్యూజియంలలో ఉన్నాయి. కొన్ని స్మగ్లర్ల బారిన పడ్డాయి. ఇప్పుడు వెలుగుచూసిన వృక్ష శిలాజాలు కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధిస్తే ఇక్కడ కూడా డైనోసార్ల శిలాజాలు వెలుగుచూసే అవకాశం ఉందని చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇప్పుడు శిలాజాలుగా మారిన వృక్షాలు కోనిఫర్ రకానికి చెందినవై ఉంటాయని ఆయన చెప్పారు. అవి రాక్షసబల్లుల్లో కొన్ని రకాలు ఇష్టంగా తినేవే. ఆ వృక్ష శిలాజాలున్నాయంటే, వాటి చెంత రాక్షసబల్లి శిలాజాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి వృక్ష శిలాజాలు విరివిగా ఉన్న ప్రాంతాలు ఏడెనిమిది మాత్రమే ఉన్నాయి. అందులో మహారాష్ట్రలోని సిరోంచా దగ్గర ఉన్న వడధామ్ ఫాజిల్ పార్కు ముఖ్యమైంది. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించి భూపతిపూర్ ప్రాంతాన్ని కూడా ఫాజిల్ పార్కుగా మా ఇక్కడి భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న శిలాజాలు ఎంతో ఉన్నతమైన చరిత్రను వెలుగులోకి తేవటానికి దోహదపడుతుంది. లేదంటే స్మగ్లర్లు ఈ శిలాజాలను తస్కరించే ప్రమాదం ఉంది. ఇది రాతిపొరల సమూహం.. కానీ కోట్ల సంవత్సరాల క్రితం ఓ వృక్షం. నిటారుగా ఉండాల్సిన చెట్టు కూలిపడిపోయి రసాయన చర్యతో ఇదిగో ఇలా రాతిపొరలా మారింది. అంటే ఇది ఓ వృక్ష శిలాజం (ఫాజిల్) అన్నమాట. దీని పొడవు 25 అడుగులపైమాటే. -
రాళ్లలో రాక్షస బల్లి!
సాక్షి, హైదరాబాద్ : డైనోసార్.. ఈ పేరు వినగానే కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి ఆ తర్వాత కనుమరుగైన రాక్షస బల్లులని అందరూ ఠక్కున చెబుతారు. మరి అవి తిరుగాడిన ప్రాంతాల గురించి అడిగితే మాత్రం మనలో చాలా మంది తెలియదనే బదులిస్తారు. అయితే మన దేశంలో ప్రత్యేకించి పూర్వపు ఆదిలా బాద్ జిల్లాలోని ప్రాణహిత–గోదావరి నదీ తీరాలు డైనోసార్లకు స్వర్గధామంగా ఉండేవన్న విషయం తెలుసా? ఆశ్చర్యంగా అని పిస్తున్నా ఇది నిజం. ఇంతకంటే విస్తుగొలిపే విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. డైనోసార్ శిలాజాలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. డైనోసార్లే కాదు, ఆ కాలంలో జీవించిన ఇతర ప్రాణుల శిలాజాలు కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసినా ఆ తర్వాత పరిశోధనలు నిలిచిపోవటంతో ఈ విషయం కాస్తా మరుగున పడిపోయింది. ఇప్పుడు తాజాగా కొందరు ఔత్సాహిక పరిశోధకులు ప్రస్తుత మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి (వేమన్‌పల్లి) చుట్టుపక్కల పరిశీలించినప్పుడు డైనోసార్తోపాటు ఇతర ప్రాణులకు చెందిన శిలాజాలుగా భావిస్తున్న భాగాలు కనిపించాయి. వంతెన రాళ్లలో శిలాజాలు... ఇది మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి శివారులో నిర్మించిన వంతెన. ఈ బ్రిడ్జి రివెట్‌మెంట్‌కు వినియోగించిన రాళ్ల మధ్యలో ప్రత్యేకంగా కనిపిస్తున్న రాళ్ల ఆకారాలను పరిశీలిస్తే అవి డైనోసార్ శిలాజాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆ ప్రాంతాన్ని ఔత్సాహిక పరిశోధక బృందంలోని çసముద్రాల సునీల్, పులిపాక సాయిలు పరిశీలించినప్పుడు రివెట్మెంట్ రాళ్ల మధ్య శిలాజాలను పోలినవి కనిపించాయి. శాస్త్రీయ నిర్ధారణ కోసం వాటి ఫొటోలను పుణె డెక్కన్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎల్. బాదామ్కు పంపగా ఆయన పరిశీలించి అందులో దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన ఓ జాతి తాబేలు శిలాజంగా గుర్తించారు. మిగతా రాళ్లలో కూడా డైనోసార్ శిలాజాలకు దగ్గరి పోలికలున్నట్లు పేర్కొన్నారు. వాటిని స్వయంగా పరిశీలించి పరిశోధిస్తే కచ్చితత్వం వస్తుందని వెల్లడించారు. అయితే పరిశోధనలు లేకపోవడం, భవిష్యత్తు అధ్యయనాలకు వీలుగా ఆ ప్రాంతాన్ని పరిరక్షించకపోవడంతో ఈ శిలాజాలు వేగంగా ధ్వంసమవుతున్నాయి. రాక్షసబల్లి రెండో ఆకృతి ఇక్కడిదే... ప్రపంచవ్యాప్తంగా డైనోసార్లపై విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన వాటి జీవిత విశేషాలపై ఇప్పటికీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ డైనోసార్లు అన్ని ప్రాంతాల్లో లేవు. మన దేశంలోని గుజరాత్, రాజస్తాన్‌లలో వాటి జాడ ఉండేదని వెలుగుచూడగా ఆ తర్వాత మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రాణహిత–గోదావరి తీరాల్లో జాడ కనిపించినట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేకార్షణగా ఉన్న ‘డైనోసారియం’లో కనిపించే భారీ రక్షాసబల్లి ఆకృతి యామన్‌పల్లి ప్రాంతంలో లభించిన డైనోసార్ అవశేషాలతో రూపొందించినదే. 44 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తున్న ఈ అస్తిపంజరం యామన్‌పల్లిలో 1974–1980 మధ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖనిజాన్వేషణలో దొరికింది. 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలను అప్పట్లో వెలికితీశారు. అందుకే ఆ రాక్షసబల్లికి ‘కోటసారస్ యమనపల్లిన్సిస్’ అనే పేరుపెట్టారు. కానరాని పరిశోధనలు... ఆంగ్లేయుల జమానాలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ఈ ప్రాంతంలో ఖనిజాన్వేషణ సమయంలో డైనోసార్ శిలాజాలను గుర్తించింది. ఆ సమయంలో కొందరు విదేశీ పరిశోధకులు కూడా వచ్చి ఇక్కడ పరిశోధనలు నిర్వహించారు. ఆ తర్వాత జీఎస్ఐ అడపాదడపా పరిశోధనలు తప్ప ప్రత్యేకంగా అధ్యయనాలు లేకుండా పోయాయి. 1980లలో జీఎస్ఐకి చెందిన తెలుగు పరిశోధకులు పొన్నాల యాదగిరి ఇక్కడే ఎగిరే రాక్షసబల్లి అవశేషాలను గుర్తించారు. ఆ తర్వాత కొత్త విషయాలేవీ వెలుగు చూడలేదు. గోదావరి బేసిన్ పరిధిలోని మలేరి, ధర్మారం, కోటలలో ఇప్పటి వీటి అవశేషాలు లభించాయి. డైనోసార్ ఎముకలు, వాటి గుడ్లు, గుడ్ల పెంకులు, ఎముకలు, అప్పటి చేపలు, తాబేళ్లు, మొసళ్ల శిలాజాలు కనిపించాయి. మహారాష్ట్ర–తెలంగాణల్లో విస్తరించిన ప్రాణహిత–గోదావరి తీరాల్లో ఆంజియోస్పర్మ్ చెట్లు విస్తృతంగా ఉండటంతో వాటి ఆకులను తినేందుకు ఈ ప్రాంతాల్లో డైనోసార్లు ఎక్కువగా ఉండేవని పరిశోధకులు గుర్తించారు. మరి వారు స్మగ్లర్లా...? డైనోసార్ అవశేషాల అధ్యయనం పేరు చెప్పి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇలా తవ్వగా ఏర్పడ్డ పెద్ద గొయ్యిని ఆ కోవదేనని పేర్కొంటున్నారు. ఇప్పటికీ వ్యవసాయ పనుల కోసం దున్నుతున్నప్పుడు డైనోసార్ శిలాజాలు వెలుగుచూస్తున్నాయి. వాటిపై కొంత అవగాహన ఉన్నవారు ఆ శిలాజాలను సేకరించి అన్వేషణకు వచ్చే ‘స్మగ్లర్ల’తో బేరసారాలు సాగిస్తున్నారని సమాచారం. ఇటీవల కొందరికి ఈ ప్రాంతంలో డైనోసార్‌కు చెందిన భారీ ఎముకల శిలాజాలు దొరికాయని, వాటిని దాచి ఆసక్తి ఉన్న వారికి అమ్మకం కోసం యత్నిస్తున్నారని సమాచారం. శిలాజాలు ఎలా... డైనోసార్లు దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం సంచరించాయి. ప్రకృతి విపత్తులతో అవి అంతరించాయి. కానీ కోట్ల ఏళ్ల కాలంలో వాటి కళేబరాలు, గుడ్లు శిలాజాలుగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ లావా ప్రవహించి అవి రాళ్లుగా మారిపోయాయి. -
డైనోసార్ల పూర్వీకుడి జాడ తెలిసింది
స్పెయిన్: దాదాపు 230 మిలియన్ సంవత్సరాల క్రితం తిరుగాడిన ఓ డైనోసార్ జాడ తెలిసింది. స్పెయిన్‌లో దాని పాద ముద్రిక స్పష్టంగా బయటపడింది. ఇప్పటి వరకు భూమిపై లభించిన రాక్షస బల్లుల పాద ముద్రికల్లో ఇదే సజీవంగా సురక్షితంగా ఉన్నట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. ఐబీరియన్ ద్వీపకల్పంలో ఈ గుర్తు భద్రంగా ఏమాత్రం చెదిరిపోకుండా ఉన్నట్లు వారు చెప్పారు. గత ఏప్రిల్‌లో ఓ వ్యక్తి బార్సిలోనాకు 40 కిలోమీటర్ల దూరంలోని మోంటెసెర్రాట్ అనే ప్రాంతంలో తిరుగుతుండగా ఈ పాదముద్ర కంటపడింది. ఈ పాద ముద్రికను ప్లాస్టర్ సహాయంతో ప్రింట్ తీసి పురాతత్వశాస్త్ర శాఖలో భద్రపరిచినట్లు అధికారులు చెప్పారు. దీని ద్వారా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ గుర్తు ప్రకారం ఆ డైనోసార్ ఇప్పటి వరకు తెలిసిన డైనోసార్లన్నింటికంటే ముందు కాలంనాటిదని చెప్పారు.