ములుగు జిల్లా అటవీప్రాంతంలో డైనోసార్ల చరిత్ర | Dinosaur Fossils Found In Mulugu District Forest Area | Sakshi
Sakshi News home page

ములుగు జిల్లా అటవీప్రాంతంలో డైనోసార్ల చరిత్ర

Published Mon, Jun 28 2021 11:45 AM | Last Updated on Mon, Jun 28 2021 11:46 AM

Dinosaur Fossils Found In Mulugu District Forest Area - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అతిపురాతన వృక్ష శిలాజాలతో కూడిన ప్రాంతం వెలుగుచూసింది. కోట్ల సంవత్సరాల క్రితం అలరారిన వృక్షాలు కాలక్రమంలో శిలాజాలుగా మారి భూమి పైపొరల్లో రాళ్లలా నిక్షిప్తమైపోయాయి. గతంలో ఇలాంటి శిలాజాలు కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూసినా.. ఇప్పుడు కొత్తగా బయటపడ్డ ప్రాంతంలో దాదాపు 40 అడుగుల పొడవు వరకు ఉన్న వృక్ష శిలాజాలు కనిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ములుగు జిల్లా కన్నాయెగూడెం మండలంలోని భూపతిపూర్‌కు నాలుగు కి.మీ. దూరంలోని దట్టమైన అటవీప్రాంతంలో ఇవి ఉన్నాయి. దాదాపు ఐదు కి.మీ. పరిధిలో ఈ శిలాజాలు కనిపిస్తుండటంతో, దేశంలో మరో విశాలమైన శిలాజవనం (ఫాజిల్‌ పార్కు) ఏర్పాటుకు అనువైన ప్రాంతం వెలుగుచూసినట్టయింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్‌ నజీర్, మహేశ్‌ తదితరులు స్థానిక కేసం రవితో కలిసి పరిశీలించి వీటిని గుర్తించారు. 

అలనాటి భారీ వృక్షాలే.. 
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాక్షసబల్లులు (డైనోసార్లు) తిరిగిన జాడలున్నాయి. పూర్వపు ఆదిలాబాద్‌ బెజ్జూరు మండలం కొండపల్లి ప్రాంతం, ఖమ్మం జిల్లాలోని కిష్టారం ఓపెన్‌ కాస్ట్‌ ఏరియా దగ్గరి చెరుకుపల్లి అటవీ ప్రాంతం, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం, మంచిర్యాల సమీపంలోని భీమారం, ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి అటవీప్రాంతం, పాల్వంచ నల్లముడి గ్రామ సమీపంలో వృక్ష శిలాజాలు గతంలో కనిపించాయి. తాజాగా వెలుగుచూసిన ప్రాంతం వాటికంటే విశాలమైంది కావటంతోపాటు పొడవాటి వృక్షాల శిలాజాలు పెద్దగా చెదిరిపోకుండా కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో డైనోసార్ల శిలాజాలు కూడా కనిపించాయి.

ఇక్కడి డైనోసార్‌ శిలాజాలు బిర్లా సైన్స్‌ మ్యూజియం, కోల్‌కతా మ్యూజియంలలో ఉన్నాయి. కొన్ని స్మగ్లర్ల బారిన పడ్డాయి. ఇప్పుడు వెలుగుచూసిన వృక్ష శిలాజాలు కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధిస్తే ఇక్కడ కూడా డైనోసార్ల శిలాజాలు వెలుగుచూసే అవకాశం ఉందని చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. ఇప్పుడు శిలాజాలుగా మారిన వృక్షాలు కోనిఫర్‌ రకానికి చెందినవై ఉంటాయని ఆయన చెప్పారు. అవి రాక్షసబల్లుల్లో కొన్ని రకాలు ఇష్టంగా తినేవే. ఆ వృక్ష శిలాజాలున్నాయంటే, వాటి చెంత రాక్షసబల్లి శిలాజాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

దేశంలో ఇలాంటి వృక్ష శిలాజాలు విరివిగా ఉన్న ప్రాంతాలు ఏడెనిమిది మాత్రమే ఉన్నాయి. అందులో మహారాష్ట్రలోని సిరోంచా దగ్గర ఉన్న వడధామ్‌ ఫాజిల్‌ పార్కు ముఖ్యమైంది. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించి భూపతిపూర్‌ ప్రాంతాన్ని కూడా ఫాజిల్‌ పార్కుగా మా ఇక్కడి భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న శిలాజాలు ఎంతో ఉన్నతమైన చరిత్రను వెలుగులోకి తేవటానికి దోహదపడుతుంది. లేదంటే స్మగ్లర్లు ఈ శిలాజాలను తస్కరించే ప్రమాదం ఉంది.

ఇది రాతిపొరల సమూహం.. కానీ కోట్ల సంవత్సరాల క్రితం ఓ వృక్షం. నిటారుగా ఉండాల్సిన చెట్టు కూలిపడిపోయి రసాయన చర్యతో ఇదిగో ఇలా రాతిపొరలా మారింది. అంటే ఇది ఓ వృక్ష శిలాజం (ఫాజిల్‌) అన్నమాట. దీని పొడవు 25 అడుగులపైమాటే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement