
కంటైనర్ పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క
కన్నాయిగూడెం: దట్టమైన అడవుల్లో జీవిస్తూ విద్య కు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం సీతక్క మాట్లాడుతూ, అటవీ గ్రామాల్లో పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ అభ్యంతరాలతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కన్నాయిగూడెం మండలంలో కంటైనర్ భవనం నిర్మించినట్లు తెలిపారు. గత పదేళ్లకాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యను నాశనం చేసిందని ఆమె ఆరోపించారు.