మొబైల్ స్కానింగ్ మెషిన్లతో చేస్తున్న ముఠా
ప్రేక్షక పాత్రలో వైద్యారోగ్యశాఖ
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్‌టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్‌ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు.
ఈ విషయం పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్‌ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది.
సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్‌టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్‌లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు.
చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
బ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు.
ఆయా జిల్లాల్లో ఇలా..
మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్‌తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు.
ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి.
అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు.
మౌనంగా అధికారులు
చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment