మల్లూరు, పాకాల, చలివాగులో పెరుగుతున్న నీటిమట్టం
ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత నది..
తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవల నిలిపివేత
సాక్షి, నెట్‌వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.
వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది.
⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది.
⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది.
⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.
వాగులో ఇద్దరు గల్లంతు
చెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు
ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్‌కు సాయంత్రం వచ్చారు.
పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment