సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే జాతరను ఈసారి 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని పూజారుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభిస్తారు.
దాదాపు పది నెలల ముందే జాతర తేదీలు..
మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఈ సారి దాదాపు 10 నెలల ముందుగానే ప్రకటించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత అనుభవాల దృష్ట్యాఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సమ్మక్క–సారలమ్మ పూజారులు కోరుతున్నారు.
షెడ్యూల్ ప్రకటనకు ముందు పూజలు..
మేడారం మహాజాతర తేదీల ఖరారు కోసం బుధవారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్, పూజారులు సిద్దబోయిన మునేందర్, సిద్దబోయిన మహేశ్, లక్ష్మణ్‌రావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేశ్, భోజారావు, జనార్దన్, అరుణ్‌కుమార్‌లు సమావేశం అయ్యారు.
కాగా, సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలను ప్రకటించే ముందు పూజారులు ఆనవాయితీగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఏడాది మహాజాతర విజయవంతంగా సాగాలని అమ్మవార్లను వేడుకున్నారు.
జాతర తేదీలు ఇవే..
ఫిబ్రవరి 21: మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు
ఫిబ్రవరి 22: చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక.
ఫిబ్రవరి 23: సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ.
ఫిబ్రవరి 24: మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశం, మహా జాతర ముగింపు.
ఫిబ్రవరి 28: మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజున తిరుగువారం పండుగ.
చదవండి: ఢిల్లీ సిగలో ‘గులాబీ’..
Comments
Please login to add a commentAdd a comment