![Water is losing its naturalness due to chemicals](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/jathara.jpg.webp?itok=jbk-F7tm)
జంపన్నవాగులో పరిశోధనల ద్వారా తేల్చిన డాక్టర్ మదన్‌మోహన్
మేడారం జాతరకు ముందు, జాతర సమయంలో,తర్వాత జంపన్నవాగులో నీటి శాంపిల్స్ సేకరణ
ఈ నెల 24, 25న నేపాల్‌లో జరిగే సదస్సుకు పరిశోధన పత్రం ఎంపిక
పుణ్య స్నానాల సందర్భంగా షాంపూలు, సబ్బుల వినియోగంతోనే ఈ పరిస్థితి
ప్రవాహ వేగం పెంచితే మేలంటున్న అధ్యయనాలు
సాక్షి, సిద్దిపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటికి పైగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే భక్తులు ఉపయోగించే షాంపూలు, సబ్బుల ఇతర కెమికల్స్ వల్ల వాగులో నీరు సహజత్వాన్ని కోల్పోతోందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్‌మోహన్ పరిశోధనల ద్వారా తేల్చారు.
వాగులో పుణ్యస్నానాలు చేశాకే...
మేడారం జాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న.. మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
వాగుకు ఇరువైపులా2 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు
మేడారంలోని జంపన్నవాగుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవులో స్నానఘట్టాలు ఉన్నాయి. భక్తులు ఈ వాగులో స్నానం చేసేందుకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి జాతర సమయాల్లో నీటిని వదులుతారు. ఈ నీరు స్నానఘట్టాల దగ్గర నిల్వ ఉండేలా ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తారు. మరోవైపు వాగులో ఉన్న ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ ద్వారా నీటిని తోడి స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు పంపిస్తారు.
భక్తులు జంపన్నవాగులో మునక వేసిన తర్వాత బ్యాటరీ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తారు. ఇలా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే లక్షలాది మంది భక్తులు జాతర జరిగే నాలుగు రోజుల పాటు నిర్విరామంగా స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఉపయోగించే షాంపులు, సబ్బుల కారణంగా జంపన్న వాగులోని నీరు సహజత్వానికి కోల్పోతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సహజమైన కుంకుమ స్థానాన్ని చాలా చోట్ల కెమికల్ కుంకుమలు ఆక్రమించడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది.
18 శాంపిల్స్ సేకరణ
గతేడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వారం రోజుల ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జంపన్న వాగులో ఆరు చోట్ల, జాతర సమయంలో ఆరు చోట్ల, జాతర ముగిసిన వారం రోజులకు ఆరుచోట్ల ఇలా 18 శాంపిల్స్ సేకరించారు.
వీటిని ప్రత్యేక బాటిళ్లలో తీసుకొచ్చి కళాశాలలో టెస్ట్ చేశారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అయితే పీహెచ్ 6.5 నుంచి 8.5, డిజాల్వడ్ ఆక్సిజన్(డీవో) 6 ఎంజీ కంటే ఎక్కువ (లీటరు నీటిలో), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) 2ఎంజీ అంతకంటే తక్కువ (లీటరు నీటిలో), బాక్టీరియా అసలు ఉండొద్దు.
24, 25 తేæదీల్లో నేపాల్‌లో ప్రజెంటేషన్
బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో కాఠ్మాండ్‌లో ఈ నెల 24,25 తేదీల్లో జరిగే 3వ అంతర్జాతీ య బయోటెక్నాలజీ సదస్సుకు జంపన్న వాగులో సాముహిక పుణ్యస్నానాలతో నీటి కాలుష్యంపై చేసిన పరిశోధన పత్రం ఎంపికైంది. దీనిపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు డాక్టర్ మదన్‌మోహన్‌కు ఆహ్వానం అందింది.
నివారణ మార్గాలు
సహజత్వాన్ని కోల్పోయిన నీటిలోబ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలాంటి నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
» వాగులో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
» క్లోరినేషన్ ఎక్కువగా చేయాలి.
» సబ్బు, షాంపుల వినియోగం, బట్టలు ఊతకడం, కుంకుమ వేయడాన్నినియంత్రించాలి.
» జాతర నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని పరిశోధన ద్వారా నిర్థారణ అయ్యింది.
జాగ్రత్తలు పాటించాలి
పుణ్యస్నానాలు చేయడం మంచిదే. తగు జాగ్రత్తలు పాటించాలి. పుణ్యస్నానాలు చేసే సమయంలో పూజా ద్రవ్యాలు అందులో వేయొద్దు. షాంపూలు, సబ్బులు వినియోగించడం వలన నీరు సహజత్వం కోల్పోయి కాలుష్యం అవుతుంది. దీంతో చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి. – డాక్టర్ మదన్ మోహన్, సిద్దిపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి
Comments
Please login to add a commentAdd a comment