పరిరక్షణ లేక అంతరించిపోతున్న స్థానిక జాతుల చేపలు
4 రకాల చేపల పెంపకం, వినియోగమే ఎక్కువ..
166 రకాలుంటే కనుమరుగయ్యే దశకు చేరిన 20 జాతులు
వివిధ రకాల చేపలను సేకరిస్తున్న సిద్దిపేటప్రభుత్వ పీజీ కాలేజీ ఫిషరీస్ విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే స్థానిక చేపల బ్రీడింగ్ చేస్తామంటున్న అధ్యాపకులు
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో స్థానిక జాతుల చేపలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. కొన్ని రకాల చేపలనే విస్తృ తంగా పెంచడం, మిగతా వాటి బ్రీడింగ్, పరిరక్షణ లేకపోవడమే దీనికి కారణమవుతోంది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల బీఎస్సీ (ఫిషరీస్), ఎమ్మెస్సీ (ఫిషరీస్) అధ్యాపకులు, విద్యార్థులు చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్ చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానిక చేపలను సేకరించి భద్రపరుస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక రకాల చేపల బ్రీడింగ్ చేపడతామని చెబుతున్నారు.
ఎన్ని ఉన్నా ఆ 4 రకాలే ఎక్కువ
రాష్ట్రంలో మొత్తం 166 రకాల చేపలుండగా.. నాలుగు రకాల చేపలే ఎక్కువగా లభిస్తాయి. రోహు (రవ్వ), బొచ్చ, బంగారు తీగ, బొమ్మె చేపలే విస్తృతంగా పెంచడం, వినియోగించడం జరుగుతోంది. మిగతా రకాల చేపలు మెల్లగాఅంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో పలు రకాల చేపల పేర్లు వినడమే తప్పితే చూసే పరిస్థితి ఉండదని నిపుణులు అంటున్నారు.ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తమ రెడ్‌బుక్‌లో ఇప్పటికే పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయని వెల్లడించింది. అందులో తెలంగాణకు చెందిన 20 రకాల జాతుల చేపలు కూడా ఉండటం గమనార్హం.
65 రకాల చేపలు సేకరించి..
చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్‌లోభాగంగా సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కలసి ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించారు. వాటిని ముందు తరాలకు చూపించడం, అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు. సహజ ఆవాసాల్లో లభించే వివిధ రకాల చేపలను సేకరించి, స్పెసిమెన్లనూ నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు గోదావరి, మున్నేరు, కృష్ణా నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి మంచినీటిలోపెరిగే చేపలను తీసుకువచ్చారు.
మలుగు పాము
పాములా కనిపిస్తున్నా ఇది చేపనే. మలుగు పాముగా పిలిచే ఈ చేపలు సాధారణంగా2 నుంచి 3 అడుగుల మేర పెరుగుతాయి. మత్స్యకారులు దీనిని మున్నేరు వాగులో పడితే విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చారు. దీనికి పొలుసులు ఉండవు.ఇది బ్రీడింగ్ సమయంలో వలస వెళ్తుంది.
మగ దుమ్మ
ఈ చేప పేరు మగ దుమ్మ. ఇది వైరా రిజర్వాయర్‌లో లభించింది. అంతరిస్తున్న చేపల రకాల్లో ఇది కూడా ఉంది. క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఒమెగా–3 ఫ్యాట్ అధికంగా ఉంటుంది.
చుక్క పాంప్రెట్ చేప
ఇది చుక్క పాంప్రెట్ చేప.ఈ రకం చేపలువలకు చిక్కాయంటే మత్స్యకారులకుపండగే. ఇవి బాగా రుచిగా ఉండటంతో ముంబై, కేరళ ప్రాంతాల ప్రజలు లొట్టలేసుకొని తింటారు. ఇవి మున్నేరు నదిలో ఉన్నాయి.
ఒక్క సిద్దిపేటలోనే ఎమ్మెస్సీ ఫిషరీస్ కోర్సు
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీఎస్సీ (ఫిషరీస్) కోర్సును నిర్వహిస్తున్నా.. ఒక్క సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల (అటానమస్)లో ఎమ్మెస్సీ(ఫిషరీస్) కోర్సు అందుబాటులో ఉంది. 2017–18లో ప్రారంభమైనఈ పీజీ కోర్సును ఏటా 40 మంది విద్యార్థులు పూర్తి చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా చేపల ఫారి్మంగ్ తీరును చూపించేందుకు.. కళాశాల ప్రాంగణంలోనే రకరకాల చేపలను పెంచుతున్నారు. ఆ చేపలకు ఫుడ్‌ను కాలేజీలోనే తయారు చేస్తున్నారు. అలాగే ఎక్వేరియం చేపల బ్రీడింగ్ కూడా చేస్తున్నారు.
బ్రామ బెలగారి
ఈ చేపను ఓసియో బ్రామ బెలగారి చేపఅంటారు. దీనిని గోదావరి నది నుంచితీసుకువచ్చారు. ఇవి అచ్చం పరక చేపల మాదిరిగా ఉంటాయి. ఈ రకం చేపలుఅంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి చేస్తాం స్థానికంగా లభించే రకరకాల చేపలు అంతరించి పోతున్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక చేపల విత్తనోత్పత్తి చేసి అందిస్తాం. మా కళాశాలలో చదివిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఫిషరీస్ చేసిన విద్యార్థులను వినియోగించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. – అయోధ్యరెడ్డి, ఫిషరీస్ హెడ్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల సిద్దిపేట
65 రకాలు సేకరించాం..
చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించి భద్రపరిచాం. కృష్ణా, గోదావరి, మున్నేరు నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి అంతరించి పోతున్న చేపలను సేకరించాం. ఏదైనా కొత్త రకం చేప పడితే చెప్పాలని మత్స్యకారులను కోరాం. ఫిషరీస్ చదివిన వారికి ప్రభుత్వంఉద్యోగాలు కల్పించి మన మత్స్య సంపదను కాపాడాలి. – సాయికుమార్, ఎమ్మెస్సీ సెకండియర్
Comments
Please login to add a commentAdd a comment