సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది.
మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment