ముంచుకొస్తున్న‘పెట్రో’ ముప్పు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు జిల్లాలోని వివిధ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తున్న స్టోరేజి పాయింట్ల మార్పు కారణంగా జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో ‘నోస్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
స్టోరేజి పాయింట్లను మార్చడం, అక్కడి నుంచి మన జిల్లాకు మరింత దూరం పెరగడంతో పాటు స్టోరేజి పాయింట్ సామర్థ్యం కూడా తక్కువగా ఉండడంతో జిల్లాకు అవసరమైన పెట్రోల్, డీజిల్ సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని రెండు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టగా, మరో రెండు, మూడు రోజుల్లో ఈ సంఖ్య పదుల్లోకి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వారం రోజుల్లో సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
54 బంకులకు మరింత సమస్య...
జిల్లాలో మొత్తం 135 పెట్రోల్ బంకులున్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీ) కంపెనీలకు చెందిన బంకుల ద్వారా రోజుకు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 7.50 లక్షల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. వీటిలో బీపీసీకి చెందిన 27, హెచ్‌పీసీకి చెందిన 54 బంకులకు ఎలాంటి సమస్యా లేకపోయినా, ఐఓసీకి చెందిన 54 బంకుల పరిస్థితి కష్టంగా మారనుంది. ఎందుకంటే ఈ బంకులకు కృష్టా జిల్లా కొండపల్లిలో ఉన్న స్టోరేజి పాయింట్ నుంచి, రాజమండ్రి నుంచి పెట్రోల్ వచ్చేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ పాయింట్‌ను కరీంనగర్ జిల్లా రామగుండానికి మార్చారు.
అంటే విశాఖపట్నం రిఫైనరీలో ఉన్న ఆయిల్ కొండపల్లి స్టోరేజి పాయింట్‌కు కాకుండా, రామగుండం వస్తే, అక్కడి నుంచి జిల్లాకు రావాల్సి ఉంది. కొండపల్లి నుంచి వచ్చేటప్పుడు రోజుకో ట్రక్కు ఆయిల్ వచ్చే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రామగుండం నుంచి ఒక ట్రక్కు వచ్చేసరికి మూడు రోజులు పడుతోంది. రామగుండంలో ఉన్న స్టోరేజి పాయింట్ సామర్థ్యం కూడా తక్కువేనని తెలుస్తోంది. రెండు జిల్లాలకు మాత్రమే సరఫరా చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఈ పాయింట్‌కు మరో మూడు జిల్లాలను అదనంగా కలపడంతో ఓవర్‌లోడ్ సమస్య అవుతోంది. ఇక్కడి నుంచి ఆయిల్ తెచ్చే ట్యాంకర్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది.
ఆంధ్ర ప్రాంతం నుంచి ట్రక్కులను తెచ్చుకుని సరఫరా చేసుకునేందుకు అక్కడి కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదు. దీంతో ఐఓసీ పరిధిలో ఉన్న జిల్లాలోని 54 బంకులకు తగినంత ఆయిల్ సరఫరా కావడం లేదు. దీంతో ఒకే ట్యాంకులో నాలుగైదు బంకులకు పెట్రోల్ పంపుతున్నారు. ఆ పెట్రోల్ తక్కువ సమయంలోనే అయిపోతుండడంతో మళ్లీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఐఓసీకి చెందిన బంకులకు సూర్యాపేటలో స్టోరేజి పాయింట్ ఉన్న హెచ్‌పీసీ నుంచి ఆయిల్ సరఫరా చేయాలని అడుగుతున్నా, అది కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.
గతంలో సూర్యాపేట నుంచి కేవలం 26 హెచ్‌పీ బంకులకు మాత్రమే ఆయిల్ రాగా, మిగిలిన బంకులకు రాజమండ్రి నుంచి వచ్చేది. ఇప్పుడు 54 బంకులకు సూర్యాపేట నుంచే సరఫరా చేయాల్సి రావడంతో సమస్య తలెత్తుతోంది. మరోవైపు కొండపల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆయిల్ తేవాలంటే మన రాష్ట్రం అదనపు పన్ను విధించే అవకాశం ఉండడంతో డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగితే జిల్లాలో పెట్రో తిప్పలు తప్పవని అధికారులు, పెట్రోల్ డీలర్లు అంటున్నారు.
బంకుల వారీ వివరాలు సేకరించిన జేసీ...
ఈ పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ శుక్రవారం ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో బంకుల వారీగా ఉన్న వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ సమాచారాన్ని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌కు కూలకషంగా వివరిస్తూ నివేదిక పంపారు. ఈ విషయమై జేసీ ‘సాక్షి’తో మాట్లాడుతూ సమస్య ఉన్న మాట వాస్తవమేనని, అయితే, దీని పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.