పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల వేతనం సాయంగా ప్రకటన
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట రూరల్: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తరఫున ఒక నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
వరదల్లో సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే పార్టీ తరఫున సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల కష్టాల్లో ఎప్పుడూ తోడుగా నిలిచే బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుత విపత్తులోనూ వారికి అండగా ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాలని హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
విపత్తు నిర్వహణలో ప్రభుత్వం విఫలం
విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న విషయం మరోమారు తేటతెల్లమైందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో వరద ప్రభావంపై కేంద్రానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ లేఖ రాయడాన్ని ఆయన ఉదాహరించారు. ప్రభుత్వ ఖాతాలో ఉన్న రూ.1,345.15 కోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధుల వినియోగంలో రేవంత్ సర్కారు మౌనంగా ఉందన్నారు.
విపత్తు నిర్వహణ నిధులున్నా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాదికి సంబంధించి రూ.208 కోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జూన్ నెలలోనే జమ అయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపమని ఆయన మండిపడ్డారు.
ఉపాధ్యాయుల తొలగింపు దుర్మార్గం
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌టైమ్ లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం తొలగించడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి మీరిచ్చే కానుక ఇదేనా సీఎం గారూ? అంటూ ప్రశ్నించారు. మూడు నెలలుగా పెండింగులో ఉన్న జీతాలు అడిగిన పాపానికి ఉద్యోగాల నుంచి తొలగించడమే ప్రజాపాలనా అని నిలదీశారు.
ఖమ్మంకు ఆరు లారీల్లో నిత్యావసర సరుకులు
వరద బాధితులకోసం గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మంకు ఆరు లారీల్లో నిత్యావసర సరుకులు పంపిస్తామని హరీశ్‌రావు తెలిపారు. బుధవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ, వరదల కారణంగా మృతిచెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్‌లో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను హరీశ్‌రావు పరిశీలించారు.
రైతులు నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 30 వేలు నష్టపరిహారం అందించాలన్నారు. భక్తరామదాసు, పాలమూరు పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వం వాటి వివరాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతు దేవయ్యకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. కాగా, సిద్దిపేటలో పలువురు స్థానికులు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు విరాళాలు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment