పలు చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఒక ఏఈఓ సస్పెన్షన్.. ఏఓ బదిలీ
సాక్షి నెట్‌వర్క్: పత్తి విత్తనాల కోసం రైతుల ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలుచోట్ల అధికార యంత్రాంగం దాడులు, తనిఖీలు చేపట్టింది. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఓ దుకాణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. లూజ్ విత్తనాలను వివిధ కంపెనీల పేరిట ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దాని యజమాని రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
⇒
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తన గోదాముల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. మరోవైపు ఇక్కడి తాంసి బస్టాండ్ సమీపంలోని నిఖిల్ ఫర్టీలైజర్ షాపులో స్టాక్ ఉన్నా డీలర్ నోస్టాక్ బోర్డు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై అధికారులు చర్యలు చేపట్టారు. నిఖిల్ ఫర్టీలైజర్ షాపు వద్ద ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏఈఓ శివచరణ్‌ను సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ అర్బన్ ఏఓ భగత్ రమేశ్‌ను బదిలీ చేశారు. ఇక విత్తనాలు గోదాంలో అందుబాటులో ఉన్నా, డీలర్లకు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాశీ–659 డిస్ట్రిబ్యూటర్ వామన్‌రావుపై కేసు నమోదు చేశారు.
⇒
ఖమ్మంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను కలెక్టర్ గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశా రు. ఆ సమయంలో దుకాణాల వద్దకు వచ్చిన రైతు లతో మాట్లాడారు. అన్ని రకాల పత్తి విత్తనాలు ఒకటేనని, ఏవైనా దిగుబడి బాగానే వస్తాయని చెప్పారు.
⇒
మరోవైపు జనుము, జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జీలుగ విత్తనాల కోసం బారులుతీరారు.
Comments
Please login to add a commentAdd a comment