ఆందోళనలో ఆ 22 వేల మంది ఉద్యోగులు.. కేసీఆర్‌ కనికరిస్తారా? | Telangana: Revenue Assistants VRAs Seek Long Pending Promotions | Sakshi
Sakshi News home page

ఆందోళనలో ఆ 22 వేల మంది ఉద్యోగులు.. కేసీఆర్‌ కనికరిస్తారా?

Published Wed, Feb 9 2022 2:16 AM | Last Updated on Wed, Feb 9 2022 3:28 PM

Telangana: Revenue Assistants VRAs Seek Long Pending Promotions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్‌ఏ) పని చేస్తున్న 22 వేల మంది సిబ్బంది పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏళ్ల తరబడి వేతనాలు పెరగకపోవడం, పదోన్నతులు రాకపోవడంతో పాటు వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తమ భవిష్యత్తు ఏంటనే బెంగ వీఆర్‌ఏలు, వారి కుటుంబ సభ్యులకు పట్టుకుంది.

తమను రెవెన్యూలోనే కొనసాగిస్తారా? ఎంతమందిని కొనసాగిస్తారు? ఇతర శాఖలకు పంపుతారా? అసలు ఉద్యోగాలను ఉంచుతారా? తీసేస్తా రా? అనే సందేహాలు వీఆర్‌ఏ వర్గాల్లో వ్యక్తమ వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు పేస్కే ల్‌ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏలు ఆందోళన బాట పట్టారు.

అన్నీ పెండింగ్‌లోనే..
క్షేత్రస్థాయిలో జరిగే రెవెన్యూ కార్యకలాపాలకు సహాయకులుగా ఉండేందుకు ప్రభుత్వం వీఆర్‌ఏలను నియమించింది. వీరిలో కొందరిని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయగా, చాలామందిని నేరుగానే నియమించింది. 2007 నుంచి వీరికి నెలకు రూ.10,500 వేతనం ఇస్తున్నారు. టీఏ, డీఏలు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,400, పట్టణ ప్రాంతాల్లో రూ.11,500 చొప్పున వేతనం వస్తోంది. అయితే తమకు ఉద్యోగ భద్రత కోసం పేస్కేల్‌ వర్తింపజేయాలని వీఆర్‌ఏలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

పేస్కేల్‌ అమల్లోకి వస్తే హెల్త్‌కార్డులు వస్తాయని, టీఏ, డీఏలతో పాటు అన్ని అల వెన్సులు క్రమం తప్పకుండా పెరుగుతాయనే ఆలోచనతో వీఆర్‌ఏలు ఈ డిమాండ్‌ చేస్తు న్నారు. వాస్తవానికి వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పదోన్నతులు ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారు. వీటితో పాటు డైరెక్ట్‌ వీఆర్‌ఏల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశం కూడా పెండింగ్‌లోనే ఉంది.  

మూడు రకాలుగా వర్గీకరణ!
విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తోన్న వీఆర్‌ఏలను మూడు రకాలుగా వర్గీకరించాలని ఉన్నతస్థాయిలో ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. అందులో 3,300 మందికి పైగా వీఆర్‌ఏలను సాగునీటి శాఖలో లష్కర్లుగా పంపాలన్న దానిపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక మిగిలిన వారిని స్కిల్డ్, అన్‌స్కిల్డ్‌ పేరుతో వర్గీకరించారు. స్కిల్డ్‌ ఉద్యోగులను రెవెన్యూలోనే కొనసాగించాలని, గ్రామానికొకరిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక, మిగిలిన 8–9 వేల మందిని అన్‌స్కిల్డ్‌ కేటగిరీలో చేర్చగా, వీరిని ఏం చేస్తారన్నదే తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే వీఆర్‌ఏలు సోమ, మంగళ వారాల్లో ధర్నాలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్‌ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్‌ కోరారు. 

వీఆర్‌ఏల డిమాండ్లివే..
సీఎం హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్‌ వర్తింపజేయాలి. 
55 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.
అర్హులైన వీఆర్‌ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి.
అందరికీ సొంత గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. 
విధుల్లో భాగంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement