సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఈ అంశంపై అధికారులతో చర్చించారు. శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. మరోవైపు పదోన్నతులకు వీలుగా ఖాళీలను లెక్క తేల్చే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.
ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది టీచర్లకు స్థాన చలనం కలగనుంది. ఒకేచోట 8 ఏళ్ల సర్వీసు నిండి అనివార్యంగా బదిలీ అవ్వాల్సిన వాళ్లు 25 వేల మంది ఉంటే..ఐదేళ్లుగా ఒకే స్కూల్‌లో పనిచేస్తున్న 25 వేల మంది కూడా బదిలీకి దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇదిలావుండగా పలు ఉపాద్యాయ సంఘాలు బదిలీలు ప్రహసనంగా మారాయని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లుకు కోరిన ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారులను నిలదీస్తే పైనుంచే పైరవీలు వస్తున్నాయని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని, దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.
సొంత జిల్లాల్లో ఖాళీలన్నీ స్పౌజ్‌లతోనే భర్తీ!
భార్యాభర్తల (స్పౌజ్) బదిలీలకు ప్రభుత్వం అనుమతించడం టీచర్ల పదోన్నతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్పౌజ్‌ల్లో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వీళ్లంతా స్కూల్ అసిస్టెంట్లు. 317 జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో 70 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) పదోన్నతులు ఇవ్వడం ద్వారా, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం దాదాపు 427 మంది స్పౌజ్‌లను సొంత ప్రాంతాలకు పంపుతున్నారు.
ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో ముందుగా వీరిని నియమిస్తారు. ఫలితంగా 13 జిల్లాల్లో ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి పొందేందుకు ఉన్న ఖాళీల సంఖ్య తగ్గే అవకాశం కన్పిస్తోంది. ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో పదోన్నతులకు ఎక్కడా అవకాశం లేకుండా పోతోంది. దీనిపై ఎస్‌జీటీలు మండిపడుతున్నారు. మరోవైపు స్పౌజ్‌లు తిరిగి తమ జిల్లాలకు రావడంతో, వారు ఇప్పటివరకు పనిచేసిన 19 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో తక్కువ సీనియారిటీ ఉన్న ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం వస్తోంది.
ప్రక్రియ మొదలుకాక ముందే బదిలీలు!
బదిలీల ప్రక్రియ మొదలవ్వక ముందే దాదాపు 120 మందిని కోరుకున్న ప్రాంతాలకు పంపుతూ ఉత్తర్వులు వెలువడటం తీవ్ర దుమారం రేపుతోంది. మరో 200 వరకు ఇదే విధమైన సిఫారసులు వచ్చినట్టు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ఉపాధ్యాయ నేతలు మంత్రి సబిత వద్ద తీవ్ర నిరసన తెలిపారు. మరోవైపు పైరవీల జోరు పెరగడంతో టీచర్లు కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలను, రాజకీయ ప్రముఖులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది మధ్యవర్తులు పుటుకొస్తున్నారు. పైనుంచి బదిలీ ఆదేశాలు తెప్పిస్తామని చెబుతూ రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
నేటి నుంచి నిరసనలు: యూటీఎఫ్
బదిలీల్లో పైరవీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి నిరసనలు చేపట్టాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చినట్లు టీఎస్ యూటీఎఫ్ నేత చావా రవి తెలిపారు. ప్రభుత్వమే పైరవీలకు తెరలేపడం టీచర్లలో అంశాంతి కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లందరికీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
29న డైరెక్టరేట్ ముట్టడి: టీఎస్పీటీఏ
స్పౌజ్ టీచర్లు 2,200 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే ఓటు హక్కు ఉండే 625 మంది స్కూల్ అసిస్టెంట్లకే బదిలీకి కల్పించడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ అన్నారు. మిగతా స్పౌజ్‌ల సంగతి తేల్చకుంటే 29న పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
బారులు తీరిన టీచర్లు
ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి నల్లగొండలో ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (డైట్) వద్ద బారులుదీరారు.
– నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment