missing persons
-
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్‌చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్‌బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్‌బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఏటూరునాగారం : తాడ్వాయి మండలం మేడా రం జంపన్నవాగులో ఈ నెల 24న స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన గూటోజు శ్రీధర్‌కుమార్(36) మృతదేహం ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు బ్రిడ్జి వద్ద కనిపించింది. రేగొండ మండలం మడతపల్లికి చెందిన శ్రీధర్ ములుగురోడ్డులో ఫర్నీచర్ వర్క్ చేసుకుంటూ కుటుంబం తో వరంగల్‌లో నివాసముంటున్నారు. కుటుంబ సభ్యులతో మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఆయన వచ్చారు. ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి గల్లంతయ్యాడు. ఆరు రోజుల అనంతరం మృతదేహం ఏటూరునాగారంలో తే లింది. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
యువతి అదృశ్యం
మేనత్త ఇంటికి వెళ్లుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కామ్గార్నగర్ మున్సిపల్ క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన నర్సింహ్మారాజు కుమార్తె జి.శిరీష (20) ఈ నెల 7వ తేదీన ఇంటినుంచి చిక్కడపల్లిలోని మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలు దేరింది. అయితే ఆమె మేనత్త ఇంటికి చేరలేదు. ఇటు ఇంటికి కూడా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో తెలిసిన వారి ఇండ్ల వద్ద, బంధువు వద్ద శిరీష ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడ శిరీష ఆచూకీ లభించలేదు. దీంతో శిరీష అన్న సంతోష్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాచిగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ అదృశ్యం
హైదరాబాద్ నగరం కుషాయిగూడలో ఓ మహిళ అదృశ్యమైంది. ఈమేరకు ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. హెచ్ బీ కాలనీకి చెందిన శ్రీదివ్య కనిపించ కుండా పోయింది. దీంతో తండ్రి రాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వెబ్సైట్లో తప్పిపోయిన వారి వివరాలు
- ఆచూకీ కనుక్కునేందుకు కొత్తదారి - వరంగల్ పోలీసుల వినూత్న ఆలోచన సాక్షి, హన్మకొండ : తప్పిపోయిన వారి ఆచూకీ కనుక్కోవడానికి వరంగల్ రూరల్ పోలీసులు ఆన్లైన్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. తప్పిపోయిన వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ రూరల్ పోలీసుల వెబ్సైట్లో పొందుపరిచారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు ఎదురైనప్పుడు సామాన్యులు తమకు తెలిసిన సమాచారాన్ని సులువుగా పోలీసులకు చేరవేయవచ్చు. గడిచిన రెండేళ్లుగా జిల్లాలో తప్పిపోయిన వ్యక్తుల వివరాలు వరంగల్ పోలీసు శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ లభించడం చాలా సందర్భాల్లో కష్టంగా మారుతుంది. కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి ఆచూకీ లభించడం కష్టం. తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించినా ఆ సమాచారం ఎవ్వరికి ఇవ్వాలి? ఏ పోలీస్ స్టేషన్లో సంప్రదించడం అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. కనిపించకుండా పోయినా.. తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ తెలిసినప్పటికీ, వారిని సరిపోల్చుకోవడం, నిర్ధారించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో పోలీసుశాఖ వెబ్సైట్ www.warangalpolice. gov.inలో లాగిన్ అవ్వాలి. ఇందులో మిస్సింగ్ పర్సన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే తప్పిపోయిన వ్యక్తుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సదరు వ్యక్తుల ఫొటోలను చూడటం ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత తప్పిపోయిన లేదా కనిపిం చకుండా పోయిన వ్యక్తి ఆచూకీ విషయంలో స్పష్టత ఉంటే పోలీసులకు సమాచారం అందించవచ్చు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2013 నుంచి ఇప్పటి వరకు 41 మంది వ్యక్తుల ఆచూకీ కనుక్కోవాల్సి ఉంది. వీరికి సంబంధించిన సమాచారాన్ని వరంగల్ రూరల్ పోలీసుశాఖ వెబ్సైట్లో ఉన్నాయి. తప్పిపోయిన వ్యక్తి పేరు, ఫొటో, ఎత్తు, మేనిచాయ, తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు ఉన్నాయి. వీటితోపాటు సదరు వ్యక్తి ఏ రోజు, ఏ స్థలం నుంచి కనిపించకుండా పోయాడు? ఇందుకు సంబంధించి ఏ పోలీసు స్టేషన్లో ఏ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు నమోదు అయ్యిందనే సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. సదరు వ్యక్తుల కదలికలు, ఆచూకీ లభిస్తే సంప్రదించాల్సిన ఫోన్నంబర్ల వివరాలు సైతం ఉన్నాయి. త తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకోవడంలో ఈ వెబ్సైట్ ఉపయోకరంగా ఉంటుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
దరికి చేర్చే దారి కాల్ సెంటర్
పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కర స్నానాలకు వచ్చి తప్పిపోయిన యాత్రికులను తిరిగి బంధువుల వద్దకు చేర్చడంలో కాల్‌సెంటర్లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్ కాల్‌సెంటర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో తప్పిపోయిన వారి వివరాలను టోల్‌ఫ్రీ నంబర్ 12890 ద్వారా నమోదు చేసుకుని ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో పది లైన్లతో కూడిన కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం వరకు సుమారు రెండు వేల మంది తప్పిపోయిన వారి వివరాలు నమోదు చేశారు. 1,930 మందిని గుర్తించి వారి బంధువుల వద్దకు చేర్చారు. మిగిలిన వారి వివరాల లభ్యం కాలేదు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్సెంటర్లో వివిధ కళాశాలల విద్యార్థులు సేవలందిస్తున్నారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించే భాగ్యం కలిగినందుకు వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర సేవ చేస్తానని ఊహించలేదు పుష్కరాల్లో సేవలందించే భాగ్యం లభిస్తుందని ఊహించలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రెవెన్యూ శాఖ పిలిచిన ఇంటర్వ్యూలో కాల్‌సెంటర్ ఆపరేటర్‌గా ఎంపికై 12 రోజులు సేవలందించడం జీవితంలో మర్చిపోలేనిది. - పి.సాయికుమార్, కాకినాడ ఈ అనుభవం మర్చిపోలేనిది పుష్కరాల్లో విధులు నిర్వహించడం గొప్ప విష యం. కాల్సెంటర్లో పని చేసే అవకాశం లభించినప్పుడు చాలా సంతోషించాను. ఈ అనుభవం జీవితంలో మర్చిపోలేనిది. - వి.హర్షిత, సీఏ విద్యార్థిని -
నెక్లెస్ గాయబ్..
గోరు చుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో. అసలే ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరిన సోనమ్ కపూర్‌కు ఇంకో షాక్ తగిలింది. తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న డెమైండ్ నెక్లెస్ దొంగతనానికి గురైంది. ఇటీవల ఓ పార్టీకి అటెండ్ అయిన సోనమ్.. తన రూమ్‌లో నెక్లెస్ ఉంచింది. కాసేపటికి అది కనిపించకపోయే సరికి అమ్మడు బిత్తరపోయింది. నెక్లెస్ మిస్సింగ్‌పై సోనమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసును అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారట. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ మిస్సయిందంటున్న నెక్లెస్ ఖరీదు రూ.5 లక్షలట. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న నెక్లెస్ మిస్సవ్వడాన్ని ఈ మిస్ కాస్త సీరియస్‌గానే తీసుకుందట.