పుష్కరఘాట్ (రాజమండ్రి):
పుష్కర స్నానాలకు వచ్చి తప్పిపోయిన యాత్రికులను తిరిగి బంధువుల వద్దకు చేర్చడంలో కాల్‌సెంటర్‌లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్ కాల్‌సెంటర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో తప్పిపోయిన వారి వివరాలను టోల్‌ఫ్రీ నంబర్ 12890 ద్వారా నమోదు చేసుకుని ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో పది లైన్‌లతో కూడిన కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం వరకు సుమారు రెండు వేల మంది తప్పిపోయిన వారి వివరాలు నమోదు చేశారు. 1,930 మందిని గుర్తించి వారి బంధువుల వద్దకు చేర్చారు. మిగిలిన వారి వివరాల లభ్యం కాలేదు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లో వివిధ కళాశాలల విద్యార్థులు సేవలందిస్తున్నారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించే భాగ్యం కలిగినందుకు వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పుష్కర సేవ చేస్తానని ఊహించలేదు
పుష్కరాల్లో సేవలందించే భాగ్యం లభిస్తుందని ఊహించలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రెవెన్యూ శాఖ పిలిచిన ఇంటర్వ్యూలో కాల్‌సెంటర్ ఆపరేటర్‌గా ఎంపికై 12 రోజులు సేవలందించడం జీవితంలో మర్చిపోలేనిది.
- పి.సాయికుమార్, కాకినాడ
ఈ అనుభవం మర్చిపోలేనిది
పుష్కరాల్లో విధులు నిర్వహించడం గొప్ప విష యం. కాల్‌సెంటర్‌లో పని చేసే అవకాశం లభించినప్పుడు చాలా సంతోషించాను. ఈ అనుభవం జీవితంలో మర్చిపోలేనిది.
- వి.హర్షిత, సీఏ విద్యార్థిని