సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ కాల్ సెంటర్)’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి లో కిసాన్ అవుట్‌బౌండ్ కాల్ సెంటర్‌తో పాటు కిసాన్ స్టూడియోలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం జాతికి అంకితం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఓ కాల్ సెంటర్ ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లోనూ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పరిశీలించారు. వారిచ్చిన సూచనలతోనే కేంద్రం జాతీయ స్థాయిలో కాల్ సెంటర్, స్టూడియోలను కేంద్రం తీసు కొచ్చిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ కేంద్ర కాల్ సెంటర్
ఈ కేంద్రం ద్వారా నిపుణులైన సిబ్బంది రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. సీనియర్ అధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఇందులో ఉంటారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ కాల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ప్రధాన పంటలు సాగయ్యే ప్రాంతాల రైతులకు ఈ కాల్ సెంటర్ మార్గదర్శకంగా నిలుస్తుంది. రైతుల కు ఫోన్ చేసి పంటల స్థితిగతులు, అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వాటి తీవ్రతను బట్టి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపిస్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై రైతుల సూచనలు తీసుకుని అమలు చేస్తారు.
కార్పొరేట్ స్థాయిలో గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 67 మంది సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ రైతులకు సాగులో, క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారానికి చక్కని వేదికగా నిలిచింది. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లో బృందాలను గ్రామాలకు పంపి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల మన్నననలు చూరగొంది.
ఛానల్ ద్వారా సీజన్‌లో పంటలవారీగా అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలతో కూడిన వీడియోలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలతో రైతులకు దగ్గరైంది. ఐసీసీ ద్వారా 8.26 లక్షల కాల్స్, 12,541 వాట్సప్ సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఆర్బీకే ఛానల్ ను 2.81 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకోగా, 57.12 లక్షల మంది వీక్షించారు. వ్యవసాయ అను బంధ రంగాలకు చెందిన 1,698 వీడియోలను అప్‌లోడ్ చేసుకొన్నారు. ఐసీసీ సేవలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నో రాష్ట్రాలు వాటి ప్రతినిధులను పంపి అధ్యయనం చేశాయి. బ్రిటిష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, యూఎన్‌వోకు చెందిన ఎఫ్‌ఏవో కంట్రీ హెడ్ చి చోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ప్రముఖులు ఈ కేంద్రం పనితీరును ప్రశంసించారు.
మన విధానాలు కేంద్రం అనుసరిస్తోంది
సీఎం జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. పలు రాష్ట్రాలు కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి. గన్నవరంలోని ఐసీసీ కాల్ సెంటర్ నాలుగేళ్లుగా రైతుల సేవలో తనదైన ముద్ర వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఏపీ స్ఫూర్తితో కేంద్రం కేసీసీను తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఐసీసీ కాల్ సెంటర్‌ను మరింత పటిష్ట పరిచి సేవలను మరింత విస్తృతం చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment