అనంతపురం: పెళ్లి సమయంలో తీసిన ఫొటోలు, వీడియో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన స్టూడియో యజమానికి రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్‌పర్సన్ ఎం.శ్రీలత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... అనంతపురానికి చెందిన శ్రీనివాసకుమార్ గత ఏడాది తన కుమారుడి వివాహ వేడుకకు సంబంధించి ఫొటోలు, వీడియో తీసేందుకు ఫొట్రోగాఫర్ జయచంద్రతో రూ.85 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో రూ.75 వేలను చెల్లించాడు.
అయితే పెళ్లి ముగిసి నెలలు గడుస్తున్నా ఫొటోలు, వీడియో ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శ్రీనివాసకుమార్ నిలదీశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియో ఇవ్వడానికి కుదరదని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని జయచంద్ర తెలిపి, ఆ మొత్తం కూడా ఇవ్వకుండా మొండికేశాడు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. జయచంద్ర తీసుకున్న రూ.75 వేలను 24 శాతం వడ్డీతో సహా చెల్లించాలని, మానసిక వేదనకు గురి చేయడంతో పాటు సేవాలోపానికి గాను మరో లక్ష రూపాయల జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించాలని పిటీషన్ దాఖలు చేశాడు.
దీనికి సంబంధించిన నోటీసులు అందుకున్న స్టూడియో యజమాని కమిషన్ ఎదుట హాజరు కాకుండా ముఖం చాటేశాడు. దీనిపై పూర్వపరాలు విచారించిన అనంతరం ఫిర్యాది పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.75వేలను 9శాతం వడ్డీతో సహా చెల్లిచండంతో పాటు మానసిన వేదనకు గురిచేయడం, సేవాలోపానికి గాను రూ.50 వేలు జరిమానా, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు అంతా కలిపి 45 రోజుల్లోపు చెల్లించాలని జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్‌పర్సన్ ఎం శ్రీలత, సభ్యులు డి. గ్రేస్ మేరి, బి. గోపీనాథ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment