గ్రామీణ యువతకు కిసాన్‌ డ్రోన్స్‌ Free training for women interested in flying a drone: AP | Sakshi
Sakshi News home page

గ్రామీణ యువతకు కిసాన్‌ డ్రోన్స్‌

Published Fri, May 31 2024 4:58 AM

Free training for women interested in flying a drone: AP

పొదుపు సంఘాల మహిళలకూ ప్రాధాన్యత

డ్రోన్‌ నడపడంపై ఆసక్తిగల మహిళలకు ఉచిత శిక్షణ

ఇప్పటికే 63 సంఘాలకు కిసాన్‌ డ్రోన్స్‌ అందజేసిన ఇఫ్కో

డ్రోన్లతో పాటు ఎలక్ట్రికల్‌ వాహనాలు సైతం అందజేత

15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా పంపిణీ

సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.లక్ష చెల్లిస్తే చాలు

నానో ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం

సాక్షి, అమరావతి: సాగులో సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా కూలీల వెతలకు చెక్‌ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) అందిస్తున్న కిసాన్‌ డ్రోన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 60 మంది నిరుద్యోగ యువత, పొదుపు సంఘాలకు శిక్షణ ఇచ్చి డ్రోన్లను అందజేసింది. రానున్న వ్యవసాయ సీజన్‌లో మరో 65 కిసాన్‌ డ్రోన్స్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

తొలి దశలో రాష్ట్రంలో 160 డ్రోన్స్‌ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. డిమాండ్‌ను బట్టి మరింత మందికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది 60 డ్రోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలను అందించింది. ఈ ఏడాది మరో 65 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై.. 18–50 సంవత్సరాల మధ్య వయసు వారు శిక్షణకు అర్హులు.

మహిళలకు 15 రోజుల శిక్షణ
ఆసక్తి, అర్హత ఉన్న వారికి 15 రోజులపాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్‌ ఏరోనాటిక్స్‌ సంస్థల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 70 మంది గ్రామీణ యువతతోపాటు 12 మంది పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి కాగానే డ్రోన్‌ పైలట్‌ లైసెన్స్‌ జారీ చేస్తున్నారు.

రూ.15 లక్షల విలువైన డ్రోన్, ఎలక్ట్రిక్‌ వాహనం
లైసెన్స్‌ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ ఆటోలను అందిస్తున్నారు. యూనిట్‌ వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా  చెల్లిస్తే చాలు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌పై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 20 వేల ఎకరాల్లో పిచికారీ లేదా ఐదేళ్ల తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్‌ వాహనం అభ్యర్థుల పేరిట బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకు ఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్‌లో అర్హుల గుర్తింపు
2024–25 సీజన్‌లో మరో 65 మందికి కిసాన్‌ డ్రోన్స్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ మొదటి వారం నుంచి అర్హులైన వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వారికి దశల వారీగా శిక్షణ ఇచ్చిన తర్వాత ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో కిసాన్‌ డ్రోన్స్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

స్వయం ఉపాధి పొందుతున్నాం
నేను బీ ఎస్సీ కంప్యూటర్స్‌ చేశా. ఇఫ్కో ద్వారా మద్రాస్‌ ఐఐటీలో డ్రోన్‌ పైలట్‌గా శిక్షణ పొందా. ఇఫ్కోతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించగా.. ఆ సంస్థ నాకు రూ.15 లక్షల విలువైన కిసాన్‌ డ్రోన్, ఎలక్ట్రికల్‌ వాహనం ఇచ్చింది. రైతు పొలాల్లో అద్దె ప్రాతిపదికన పురుగు మందులు, నానో ఎరువులు పిచికారీ చేసినందుకు ఎకరాకు రూ.300 తీసుకుంటున్నా. – కయ్యూరు మహేష్, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా

ఖర్చు  తగ్గుతోంది
ఇఫ్కో ద్వారా శిక్షణ పొంది కిసాన్‌ డ్రోన్‌ తీసుకున్నాం. గతంలో ఎకరాకు పిచికారి చేయాలంటే రూ.500 నుంచి రూ.600 వరకు కూలీ­లకు చెల్లించాల్సి వచ్చేది. కూలీలు దొరక్క చాలా ఇవ్వండి పడేవాళ్లం. కిసాన్‌ డ్రోన్‌తో 25 ఎకరాల వరకు పిచికారి చెయగలుగుతున్నాం. ఇప్పుడు కేవలం 4–5 నిముషాల్లో ఎకరా విస్తీర్ణంలో పిచికారీ పూర్తవుతోంది. వృథా కూడా ఏమీ ఉండటం లేదు. ఎకరాకు రూ.300 వరకు ఆదా అవుతోంది. – కొక్కిరాల వెంకట సుబ్బారావు, దుగ్గిరాల, బాపట్ల జిల్లా

రైతు ఖర్చులు తగ్గించడమే లక్ష్యం
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రో­త్స­హించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్‌ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. గతేడాది 60 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది మరో 65 మందికి కిసాన్‌ డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్‌ వాహనాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం  – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్‌ మార్కెటింగ్‌ మేనేజర్, ఇఫ్కో

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement